GHMC Ward Delimitation: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో చేపట్టిన వార్డుల పునర్విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్‌ఎంసీని 150 నుంచి 300 వార్డులుగా పునర్విభజిస్తూ రూపొందించిన డ్రాఫ్ట్‌పై అభ్యంతరాల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగియనుంది. సరిహద్దుల మార్పు, జనాభా లెక్కల్లో వ్యత్యాసాలు, ఒకే కాలనీని రెండు మూడు వార్డులుగా చీల్చడం వంటి అంశాలపై ఇప్పటికే రాజకీయ పార్టీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల నుంచి సుమారు 5,905 అభ్యంతరాలు వెల్లువెత్తాయి. మరోవైపు, ఒక వార్డులోని జనాభాను మరో వార్డులో కలిపారని, వార్డుల పేర్లు మార్చారని ఇలా అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
హైకోర్టు ఆదేశాలతో పారదర్శకత
వార్డుల విభజనపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు, ఈ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేసింది. వార్డుల వారీగా జనాభా వివరాలు, మ్యాపులను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచాలని జీహెచ్‌ఎం(GHMC)సీని ఆదేశించింది. దీనికి తోడు, అభ్యంతరాల సమర్పణకు మరో రెండు రోజుల అదనపు గడువును ఇచ్చింది. ఈ పొడిగించిన గడువు నేడు (శుక్రవారం) సాయంత్రంతో ముగియనుండటంతో, చివరి రోజు భారీగా ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక సాంకేతిక అంశాలతో మ్యాప్స్, జనాభా వివరాలు అందజేయడంలో ఆలస్యం కావడంతో నేటి నుంచి వాటిని కూడా జీహెచ్ఎంసీ అందుబాటులో ఉంచనుంది. వార్డుల పునర్విభజనపై హైకోర్టు ఎలాంటి స్టే గానీ, అభ్యంతరాలు గానీ తెలియజేయకపోవడంతో వార్డుల డీలిమిటేషన్‌కు దాదాపు లైన్ క్లియర్ అయినట్టననే వాదనలున్నాయి. దీంతో, ప్రభుత్వ నిర్ణయం అమలుకు ఎలాంటి అడ్డంకులు ఉండకపోచ్చునని అధికారులు భావిస్తున్నారు.
Also Read: Viral Video: పెళ్లి కూతురు కోసం వచ్చి.. బొక్కబోర్లా పడ్డ ఫొటోగ్రాఫర్.. నవ్వులే నవ్వులు!
డిసెంబర్ 31 నాటికి ప్రక్రియ పూర్తి
ఇక హైకోర్ట్ ఆదేశాలతో జీహెచ్ఎంసీ ఆ దిశగా చర్యలు చేపట్టింది. వార్డుల వారీగా అన్ని వివరాలను మ్యాపులతో సహా అందించే ప్రయత్నం చేయగా, మరికొన్ని గంటల్లోనే అందజేస్తామని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రస్తుతం పరిపాలనా సౌలభ్యం, రాజకీయ లెక్కలు, న్యాయ పరిమితులు ప్రాతిపదికన కొనసాగుతుందనే చెప్పవచ్చు. అభ్యంతరాల డిస్పోజ్ తర్వాత ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయం కీలకమై విస్తరిత గ్రేటర్ హైదరాబాద్ నగర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. పునర్విభజన కొలిక్కి వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీని యథావిధిగా కొనసాగిస్తారా? లేక రెండు, మూడు ముక్కలు చేస్తారా? అన్న విషయంపైన చర్చ జరుగుతున్నది. ఈ చర్చలకు సర్కారు ఎలాంటి క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.
Also Read: Panchayat Elections: గతంలో కంటే రికార్డ్ స్థాయి పోలింగ్.. పంచాయతీ ఎన్నికల్లో 85.30 శాతం ఓటింగ్

