GHMC Commissioner Karnan: జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కర్ణన్ (Karnan) బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆహార భద్రత (ఫుడ్ సేఫ్టీ)పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలోని హోటళ్లు, హాస్టళ్లు, బేకరీలు, స్వీట్ షాపులపై ఇప్పటికే దాడులు నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ (Food Safety) అధికారులు, త్వరలోనే కల్తీ నెయ్యి, పెరుగు విక్రయిస్తున్న సంస్థలపై దాడులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. వారానికో రకం ఆహార పదార్థాల విక్రయాలపై, ఒక్కో సర్కిల్‌లో రోజుకు కనీసం ఐదు వ్యాపార సంస్థలపై దాడులు నిర్వహించి, ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే శాంపిల్స్ సేకరించాలని కమిషనర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
Also Read: GHMC Commissioner Karnan: సీనియర్లకు గుడ్‌బై.. గ్రేడ్-2, 3 కమిషనర్లకు ఛాన్స్!
తాజాగా, నగరంలో పెరుగుతున్న గుండె జబ్బులకు కల్తీ నెయ్యి, పెరుగే కారణమంటూ పలు సర్వేలు తేల్చడంతో, ఈ ఉత్పత్తులను విక్రయిస్తున్న సంస్థలపై దాడులు చేయడానికి జీహెచ్ఎంసీ (GHMC) సన్నద్ధమవుతుంది. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో కలుషిత, కల్తీ ఆహారంతో అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ దాడులు నిర్వహించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. ఎన్ని రకాల దాడులు నిర్వహించినా కల్తీ జరుగుతూనే ఉండటంతో, ప్రస్తుతం వర్షాకాలం కావడంతో కేటగిరీల వారీగా విభజించి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటి వరకు జరిగిన తనిఖీలు..
❄️ హాస్టళ్లు: మే 23, 24 తేదీల్లో 117 హాస్టళ్లపై దాడులు నిర్వహించి, 33 హాస్టళ్ల (hostels) యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. 7 హాస్టల్ కిచెన్‌లను మూసివేసి, లైసెన్స్ లేకపోవడం, ఆహార నాణ్యత, అగ్నిమాపక భద్రత, పరిశుభ్రత పాటించనందుకు రూ.1.81 లక్షల జరిమానా విధించారు.
❄️స్వీట్ షాపులు: జూన్ 11న నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 79 స్వీట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించి, నిబంధనలు పాటించని 14 స్వీట్ షాపులను సీజ్ చేశారు.
❄️బేకరీలు: జూన్ 20న 90 బేకరీలపై దాడులు చేసి, దాదాపు 80 బేకరీల్లో కాలం చెల్లిన, నాసిరకం పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 80 బేకరీలకు సంబంధించిన శాంపిల్స్‌ను నాచారంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ ల్యాబోరేటరీకి పంపించారు. రిపోర్టులు వచ్చిన తర్వాత కేసులు నమోదు చేసి బాధ్యులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
❄️ఆస్పత్రి క్యాంటీన్లు: జూన్ 24న ఆస్పత్రుల్లోని 93 క్యాంటీన్లలో తనిఖీలు నిర్వహించి, ఆహార భద్రత నిబంధనలు పాటించని 14 హాస్పిటల్ క్యాంటీన్లకు నోటీసులు ఇచ్చారు. రోగులు చికిత్స పొందే ఆస్పత్రుల్లోనూ కల్తీ, అపరిశుభ్రత చోటుచేసుకోవడంపై ఫుడ్ సేఫ్టీ వింగ్ సీరియస్‌గా ఉంది.
❄️ఫుడ్ సేఫ్టీ వింగ్‌కు గతంలో కమిషనర్‌గా పనిచేసిన అనుభవం ఉన్నందున, ప్రస్తుత కమిషనర్ కర్ణన్ నగరంలో ఆహార కల్తీని వీలైనంత వరకు తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం.
Also Read: Triple R Project: హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ప్రభుత్వం కీలక హామీ!