Karimnagar Cricketer: తెలంగాణ మట్టిలో పుట్టిన మరో క్రికెట్ ఆణిముత్యం ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బరిలోకి దిగబోతున్నాడు. కరీంనగర్ జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువ క్రికెటర్ పేరాల అమన్ రావును ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. జిల్లాకు చెందిన యువకుడు ప్రపంచ స్థాయి టోర్నీకి ఎంపిక కావడంతో కరీంనగర్ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అమన్‌కు క్రికెట్ పట్ల ఆసక్తి
ప్రస్తుతం హైదరాబాద్ అండర్-23 రంజీ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అమన్ రావు, ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తన బ్యాటింగ్ విన్యాసాలతో అదరగొట్టాడు. 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో రెండు అర్ధ సెంచరీలు బాది ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌లే అతడికి ఐపీఎల్ తలుపులు తెరిచేలా చేశాయి. అమన్ రావు తండ్రి మధుకర్ రావు కూడా గతంలో జిల్లా స్థాయి క్రికెటర్ కావడంతో, చిన్నతనం నుంచే అమన్‌కు క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగింది.
Also Read: Karimnagar Crime: రాష్ట్రంలో ఘోరం.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం.. అన్నను చంపిన తమ్ముడు
దేశం గర్వించే స్థాయికి
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన మధుకర్ రావు – సమీరా దంపతుల చిన్న కుమారుడైన అమన్, ప్రస్తుతం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. తండ్రి అందించిన ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు. అమన్ రావు ఐపీఎల్‌కు ఎంపికయ్యాడన్న వార్త తెలియగానే సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, బంధువులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు. భవిష్యత్తులో అమన్ రావు భారత జాతీయ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు.
Also Read: Karimnagar News: స్మశానంలో నిద్రిస్తున్న యువతి.. 3 రోజులుగా తల్లి సమాధి వద్దే.. ఆందోళనలో స్థానికులు!

