Karimnagar Crime: అన్నదమ్ములు అంటే రామ, లక్ష్మణులుగా ఉండాలని ప్రతీ తల్లిదండ్రులు కోరుకుంటారు. కష్ట కాలంలో ఒకరికొకరు అండగా నిలవాలని భావిస్తుంటారు. అలాంటిది ఓ తమ్ముడు ఇన్సూరెన్స్ డబ్బుకు ఆశపడి సొంత అన్ననే దారుణంగా హత్య చేశాడు. మతి స్థిమితం లేని అన్న పేరు మీద ఇన్సూరెన్స్ పాలసీలు, గోల్డ్ లోన్ తీసుకొని.. పక్కా ప్లాన్ తో డబ్బులు కొట్టేయాలని భావించాడు. చివరికి కథ అడ్డం తిరగడంతో కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్ జిల్లా రామడుగు పట్టణానికి చెందిన మామిడి వెంకటేష్ (37), మామిడి నరేశ్ అన్నదమ్ములు. మతిస్థిమితం సరిగా లేకపోవడంతో వెంకటేష్ ఖాళీగానే ఉంటున్నాడు. నరేశ్ మాత్రం టిప్పర్లను నడపడంతో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నాడు. షేర్ మార్కెట్లలోనూ పెట్టుబడులు సైతం పెట్టేవాడు. అయితే షేర్స్ లో నష్టం రావడం, టిప్పర్ల కోసం తీసుకున్న రుణం పెరిగిపోవడంతో దాదాపు రూ.కోటిన్నర వరకూ అప్పులపాలయ్యాడు.
అన్నపై ఇన్సూరెన్స్ పాలసీలు
అప్పుల నుంచి బయటపడేందుకు అన్న వెంకటేష్ ను పావుగా ఉపయోగించుకోవాలని నరేశ్ కుట్ర పన్నాడు. తెలివిగా అతడిపై రూ.4.14 కోట్ల వరకూ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకున్నాడు. అదే సమయంలో ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.20 లక్షల గోల్డ్ లోన్ సైతం పొందాడు. ఈ క్రమంలో తన అన్నను అడ్డు తొలగించుకుంటే ఇన్సూరెన్స్ సొమ్ము మెుత్తం తనే కొట్టేయవచ్చని అనుకున్నాడు. అప్పులు అన్ని తీర్చేసి మిగిలిన డబ్బుతో హ్యాపీగా జీవించొచ్చని భావించాడు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో అమానుష ఘటన
రూ.4.14 కోట్ల బీమా సొమ్ము కోసం అన్నను చంపిన తమ్ముడు
టిప్పర్‌తో ఢీకొట్టి చంపి ప్రమాదంగా చిత్రీకరణ
మూడు రోజుల క్రితం జరిగిన హత్యకేసును ఛేదించిన పోలీసుల pic.twitter.com/lg1AdnTzVU
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2025
పక్కా ప్లాన్‌తో మర్డర్ స్కెచ్..
అన్న వెంకటేష్ ను హత్య చేసేందుకు తన వద్ద టిప్పర్ డ్రైవర్లుగా పనిచేస్తున్న రాకేశ్, ప్రదీప్ సాయాన్ని నరేశ్ కోరాడు. వారు అంగీకరించడంతో హత్యకు ప్లాన్ వేశాడు. నవంబర్ 29న పథకం ప్రకారం ప్రదీప్.. నరేశ్ కు ఫోన్ చేసి టిప్పర్ బ్రేక్ డౌన్ అయ్యిందని.. రిపేర్ చేసేందుకు జాకీ పంపాలని చెప్పాడు. అప్పుడు నరేశ్.. తన అన్న వెంకటేశ్ చేతికి ఇచ్చి జాకీని పంపాడు. వెంకటేశ్ ఘటనాస్థలికి చేరుకొని టిప్పర్ ను జాకీ పెట్టి లేపుతుండగా.. డ్రైవర్ సీటులో ఉన్న రాకేశ్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో వెంకటేశ్ స్పాట్ లోనే ప్రాణాలు విడిచాడు.
Also Read: Mahabubabad Crime: తల్లితో అక్రమ సంబంధం.. కూతురుపై అత్యాచారం.. బయ్యారంలో షాకింగ్ ఘటన
అల్లుడు చూడటంతో..
అయితే ఇక్కడి వరకూ నరేశ్ అనుకున్నట్లుగానే జరిగినప్పటికీ.. అతడికి అల్లుడు సాయి రూపంలో ఊహించని షాక్ తగిలింది. వెంకటేశ్ మృతి చెందిన సమయంలో సాయి ఘటనాస్థలిలోనే ఉన్నాడు. టిప్పర్ ను కావాలనే ముందుకు నడిపి వెంకటేశ్ ను హత్య చేశారని.. తాత మామిడి నర్సయ్యకు సాయి తెలిపాడు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నరేశ్ చేసిన కుట్రలు బయటపడ్డాయి. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి.. పోలీసులు రిమాండ్ కు తరలించారు.
