Hyderabad Crime News: హైదరాబాద్‌లో ఒకేరోజు వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని, కలకలాన్ని సృష్టించింది. ఈ ఘటనల్లో ఇంటర్ విద్యార్థిని, ఇంజినీరింగ్ విద్యార్థితో పాటు మరొక ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయారు.
శ్రీచైతన్య హాస్టల్‌లో వర్షిత ఆత్మహత్య
మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన వర్షిత (16) బాచుపల్లిలోని శ్రీచైతన్య కాలేజీ హాస్టల్‌లో ఇంటర్మీడియెట్ చదువుతుంది. హాస్టల్‌కు వచ్చిన వర్షిత తల్లిదండ్రులు నర్మద, మాధవరెడ్డి… తమ ఊళ్లో జాతర ఉందని చెప్పి కూతురిని వెంట తీసుకెళ్తామని ప్రిన్సిపాల్‌ను కోరారు. అయితే, పరీక్షలు దగ్గర పడుతున్నాయని ప్రిన్సిపాల్ వారిని వెనక్కి పంపించివేశాడు. ఈ క్రమంలో, రాత్రి వర్షిత సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. గాంధీ ఆస్పత్రి మార్చురీ వద్ద మీడియాతో మాట్లాడుతూ… తాము అడిగినప్పుడు వర్షితను పంపించి ఉంటే, తమ బిడ్డ ప్రాణాలతో ఉండేదని విలపిస్తూ చెప్పారు. ఇంతకు ముందు కూకట్‌పల్లి బ్రాంచ్‌లో చదివిన వర్షితను బాచుపల్లికి మార్చారని, అప్పటి నుంచి తనకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదని చెబుతూ వచ్చిందని వారు పేర్కొన్నారు.
Also Read: Jangaon News: బ్రిడ్జి పోరాటంలో జైలుకు వెళ్ళిన ఉమాపతికి సన్మానం..!
ఓయూలో ఇంజినీరింగ్ విద్యార్థి
మరో ఘటనలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్న విజ్ఞాన్ తేజ్ (19) ఆక్సిజన్ పార్కులో చెట్టుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, రాజాపూర్ గ్రామానికి చెందిన విజ్ఞాన్ తేజ్ డిప్లొమా పూర్తి చేసి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరాడు. క్యాంపస్‌లోని కెన్నెరా హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం క్లాస్ నుంచి బయటకు వెళ్లిన విజ్ఞాన్ తేజ్ రాత్రి ఆక్సిజన్ పార్కులో చెట్టుకు ఉరి వేసుకుని ఉండగా తోటి విద్యార్థులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విజ్ఞాన్ తేజ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
నిజాంపేటలో ఇంటర్ విద్యార్థి
నిజాంపేట ప్రగతినగర్‌లో మరో ఇంటర్ విద్యార్థి మంజునాథ్ (18) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రగతినగర్‌లోని ఓ జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న మంజునాథ్, ఓ యువతిని ప్రేమించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ యువతి తల్లి, మరో మహిళ మంజునాథ్ ఇంటికి వచ్చి అతనికి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. అదే రోజు రాత్రి మంజునాథ్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం నగరంలో తీవ్ర కలకలం రేపింది.
