Viral Video: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో పాపులారిటీ కోసం కొందరు యువకులు ఎంతకైన తెగిస్తున్నారు. ‘ఎవరూ ఏమనుకున్నా పర్లేదు.. నాకు మాత్రం ఫేమ్ రావాలి’ అన్న భావనతో రెచ్చిపోతున్నారు. రైలు పట్టాలపై పడుకోవడం, బిల్డింగ్స్ మీద నుంచి దూకడం, సమాజానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ పనులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. తాజాగా రీల్స్ పిచ్చితో పాములను సైతం చిత్రహింసలకు గురిచేసిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై జంతు ప్రేమికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..
కర్ణాటకలోని శివమొగ్గలో పాములపై అమానుష వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు రీల్స్ కోసం రెండు కొండ చిలువలను (ఇండియన్ రాక్ పైథాన్) చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన అగుంబె అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. పాములను బలవంతంగా పట్టుకొని కొందరు రీల్స్ చేయడానికి ప్రయత్నించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
వీడియో ఏముందంటే?
వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు కొండ చిలువను పట్టుకొని ఉండగా మరో వ్యక్తి దాని నోటిని టేప్ తో కట్టేయడం కనిపించింది. అనంతరం వారు దానిని మెడలో వేసుకొని ఫొటోలు, వీడియోలకు ఫోజులిచ్చారు. రెండు పాముల తోకలు పట్టుకొని రోడ్డుపై కొద్దిసేపు హల్ చల్ చేశారు. దీంతో అటుగా వెళ్లే వాహనదారులు ఏం జరుగుతుందో అర్థం కాక అక్కడే చూస్తూ ఉండిపోయారు. అయితే పాములతో రీల్స్ చేసిన వ్యక్తిని మహమ్మద్ ఇర్ఫాన్ గా గుర్తించారు. వీడియోలు వైరల్ అయిన వెంటనే అతడు పరారైనట్లు తెలుస్తోంది.
అసలు ఎవరీ ఇర్ఫాన్?
శివమొగ్గకు చెందిన ఇర్ఫాన్ తాను పాములు పట్టే వ్యక్తినని చెప్పుకునేవాడు. అతను పాములను రోడ్డు మీద లాగుతుండగా.. అతడి స్నేహితులు వాటిని భుజాలపై మోస్తూ ఉన్న వీడియోలు కూడా బయటపడ్డాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో భద్రావతి అటవీ అధికారులు వెంటనే చర్యలు ప్రారంభించారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖాండ్రే ఆదేశాల మేరకు ఇర్ఫాన్ ఇంటిపై దాడి నిర్వహించారు.
Playing with Pythons!#Karnataka #Forest Dept is searching for self-proclaimed snake rescuer Irfan, who captured Indian rock pythons & taped their mouth with gum-tape in Shivamogga. His friends posed with pythons. 5 snakes were recovered from his house.@timesofindia pic.twitter.com/ndujct0oic
— TOI Bengaluru (@TOIBengaluru) September 17, 2025
Also Read: AP Onion Farmers: ఉల్లి ధర భారీగా పతనం.. కిలో 30 పైసలు మాత్రమే.. చరిత్రలో ఫస్ట్ టైమ్!
కఠిన చర్యలకు మంత్రి ఆదేశం
ఇర్ఫాన్ ఇంటి నుంచి మూడు ఇండియన్ రాక్ పైథాన్‌లు, రెండు నాగుపాములను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ప్లాస్టిక్ సంచులలో బంధించి ఉంచినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ పాములన్నీ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 ప్రకారం షెడ్యూల్-1 జాతికి చెందిన రక్షిత జీవులని తెలిపారు. మరోవైపు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.