AP Onion Farmers: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా ఏపీలో ఉల్లి దెబ్బకు రైతులు కన్నీరు పెడుతున్నారు. ఉల్లికి అతిపెద్ద మార్కెట్ గా ఉన్న కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో కనీవినీ ఎరుగని స్థాయిలో ధరలు పతనమయ్యాయి. ఖరీఫ్ సీజన్ లో సాగుచేసిన ఉల్లి.. భారీగా మార్కెట్ కు పోటెత్తడంతో ధరలు మరింత పతనమయ్యాయి. ఏకంగా కిలోకు 30 పైసలకు పడిపోవడంతో రైతన్నలు లబోదిబో అంటున్నారు.
మార్కెట్‌లో పేరుకుపోయిన ఉల్లి
ప్రస్తుతం కర్నూల్ మార్కెట్ షెడ్లలో ఎటు చూసినా ఉల్లి బస్తాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఉల్లి అమ్ముకోవడం కోసం వచ్చే వాహనాలు రహదారిపై గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం లేదంటూ రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి బస్తాలను హోటళ్లకు, హాస్టళ్లకు, పీడీఎస్ సెంటర్లు, రైతు బజారు లకు సప్లై చేసినా మార్కెట్ లో ఉల్లి బస్తాలు ఇంకా తరగకపోవడం గమనార్హం.
కిలో 30 పైసలు మాత్రమే
ప్రస్తుతం కర్నూలు మార్కెట్ లో క్వింటా ఉల్లి చరిత్రలోనే అత్యల్ప ధరకు విక్రయమవుతోంది. ఉల్లి క్వాలిటీని బట్టి క్వింటాకు రూ. 30, రూ.50, రూ.60, రూ.90, రూ.100, రూ.200, రూ.300, రూ.400, రూ.500లకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా కేజీకి 30 పైసలు మాత్రమే వస్తోందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి ఖర్చు రాక కన్నీటి పర్యంతమవుతున్నారు.
మహారాష్ట్ర ఉల్లి వల్లే…
మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి.. స్థానిక పంటపై పెను ప్రభావం చూపిస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిని కట్టడి చేయడంలో అధికారులు విఫలమవుతున్నట్లు ఆరోపిస్తున్నారు. మహారాష్ట్ర ఉల్లిని కొద్ది రోజులు రాష్ట్రంలోకి అనుమతించకుండా ఉంటే స్థానిక రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశముందని రైతులు అంచనా వేస్తున్నారు.
ఉల్లి బస్తా రూ.100
మరోవైపు మార్కెట్ పెద్ద ఎత్తున ఉల్లి బస్తాలు కుళ్లి పోతుండటం.. రైతులు డంప్ యార్డ్ కు తరలిస్తుండటంతో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 21) నుంచి కర్నూలు మార్కెట్ యార్డ్ లో వంద రూపాయలకు ఉల్లి బస్తా(సుమారు 45 కిలోలు) విక్రయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 10 గంటల నుండి కర్నూలు మార్కెట్ యార్డ్ లోని గోడౌన్ నెం.7 వద్ద ఉల్లి విక్రయాలు జరగనున్నట్లు జాయింట్ కలెక్టర్ బి. నవ్య ప్రకటించారు.
వ్యాపారస్తులు త్వరపడండి
ఒక బస్తా 100 రూపాయలకే చాల చౌకగా లభిస్తున్నందున.. వ్యాపారస్తులు, స్ట్రీట్ వెండర్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, బజ్జీల కొట్టు వారు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉల్లిపాయలను కొనుగోలు చేసుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయంతో కొంతమేర రైతులకు మేలు కలుగుతుందని జాయింట్ కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
Also Read: TG Congress: పకడ్బంధీగా కాంగ్రెస్ వ్యూహం.. ప్రతిపక్షాలను ఇరికించే ప్లాన్.. ఫలించేనా!
ఉల్లి రైతులకు గుడ్ న్యూస్
మరోవైపు రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనమవుతున్న వేళ.. కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ధరల పతనంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఆర్థిక భరోసా అందించాలని నిర్ణయించింది. ఉల్లిని ఎంత ధరకు అమ్మారనే విషయంతో సంబంధం లేకుండా ప్రతీ హెక్టారుకు రూ.50 వేల చొప్పున సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ నగదు నేరుగా ఉల్లి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని 30వేల మంది రైతులకు లబ్ది చేకూరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ఖజానాపై రూ.100 కోట్ల వరకూ భారం పడనున్నట్లు అంచనా వేశాయి.