Viral Video: సాధారణంగా శుభకార్యాలు, ఫంక్షన్లు అనగానే పెద్ద మెుత్తంలో బంధువులు వస్తుంటారు. వారందరికీ రుచికరమైన ఆహారం అందించడమంటే మామూలు విషయం కాదు. అతి భారీ పాత్రల్లో ఆహారాన్ని వండాల్సి ఉంటుంది. ఇందుకోసం వంటవాళ్లు శారీరకంగా ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. పెద్ద కడాయిలో ఉన్న ఆహారాన్ని కలిపేందుకు, చిన్న గిన్నెల్లోకి దానిని మార్చి వడ్డించేందుకు వంటవాళ్లు చాలా మంది అవసరమవుతుంటారు. అయితే ఈ పనికి జేసీబీని ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియోలో ఏముందంటే?
ఉత్తర భారతదేశంలో ఏ శుభకార్యం, ఫంక్షన్ జరిగినా.. దాల్ మఖానీ వంటకం ఉండాల్సిందే. ఎంతో రుచికరంగా ఉండే ఈ వంటకాన్ని పెళ్లిళ్లల్లో తప్పనిసరిగా బంధువులకు వడ్డిస్తుంటారు. అయితే అలాంటి వంటకాన్ని కలిపేందుకు పెద్ద గరిటను ఉపయోగించడానికి బదులు.. ఏకంగా జేసీబీని ఉపయోగించారు. పొయ్యిపైన పెద్ద గిన్నెలో ఉన్న దాల్ మఖానీ మిశ్రమాన్ని జేసీబీతో తీయడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు.
నెటిజన్ల రియాక్షన్..
వంటకాన్ని కలిపేందుకు జేసీబీని ఉపయోగిస్తున్న వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. గిన్నెలోని వంటకంపై కూడా సెటైర్లు వేస్తున్నారు. ‘ఆ వంటకంలో ఆహార పదార్థాలు ఏమో గానీ.. నూనె మాత్రం గట్టిగా వేశారు’ అని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘జేసీబీతో రోడ్లు నిర్మించడం చూశాం. అక్రమణలు తొలగించడం చూశాం. కానీ జేసీబీతో భోజనం వండటం మాత్రం ఇప్పుడే తొలిసారి చూశాం’ అంటూ ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘చూస్తుంటేనే ఏదోలా ఉంది.. తినేవారి పరిస్థితి ఏంటో’ అంటూ ఇంకొందరు పేర్కొన్నారు.
View this post on Instagram
Also Read: Rahul Gandhi: అన్నంత పని చేసిన రాహుల్.. ఈసీపై హైడ్రోజన్ బాంబ్.. వారం డెడ్ లైన్!
ఫుడ్ లవర్స్ ఏమంటున్నారంటే?
ఈ వీడియోను చూసిన ఫుడ్ లవర్స్ కొందరు ఆశ్చర్యపోయి నవ్వుకోగా.. మరికొందరు ఆ దాల్ మఖానీ ఆరోగ్యకరమా? అని ఆందోళన చెందారు. ‘ఈ వంటకం తింటే ఆరోగ్యంతో పాటు జేసీబీకి ఉన్న గ్రీజు కూడా ఫ్రీ లభిస్తుంది’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. ‘ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు’ అంటూ ఇంకొకరు మండిపడ్డారు. ‘ఇప్పుడే అరగంట క్రితం ఈ జేసీబీ కాలువ నుంచి చెత్త తీయడానికి వాడి ఉండొచ్చు. ఇప్పుడు వంట చేస్తున్నారా?. ఇది పూర్తిగా అసురక్షితం, శుభ్రత లేనిది’ అని ఫుడ్ లవర్స్ మండిపడుతున్నారు.