Rahul Gandhi: ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఓట్ల చోరికి సంబంధించి త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానంటూ ఇటీవల రాహుల్ వ్యాఖ్యానించారు. దానిని నిజం చేస్తూ.. తాజాగా రాహుల్ భారీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈసారి ఎన్నికల సంఘంతో పాటు భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)పై సూటిగా ఆరోపణలు చేశారు.
‘కాంగ్రెస్ కు బలమున్న చోట ఓట్ల చోరీ’
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై చేస్తున్న ఆరోపణలకు గురువారం (సెప్టెంబర్ 18) మరింత పదును పెట్టారు. కర్ణాటక, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఈసీ తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమున్న ప్రాంతాల్లో భారీగా ఓట్లు తొలగించబడినట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ తొలగింపులు నకిలీ లాగిన్‌లు, నకిలీ ఫోన్ నంబర్లతో రాష్ట్రం వెలుపల నుండి సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రతి ఎన్నికలోనూ కొంతమంది వ్యక్తులు.. దేశవ్యాప్తంగా లక్షలాది ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షానికి ఓటు వేసే వారి పేర్లను ఒక క్రమ పద్ధతిగా తీసివేస్తున్నారు. దీని గురించి మాకు 100% ఆధారాలు ఉన్నాయి’ అని రాహుల్ అన్నారు.
Election Commission of India must stop protecting Vote Chors.
They should release all incriminating evidence to Karnataka CID within 1 week. #VoteChoriFactory pic.twitter.com/Abiy1OHLQP
— Rahul Gandhi (@RahulGandhi) September 18, 2025
అలా కుంభకోణం బయటపడింది: రాహుల్
కర్నాటకలోని కాలబుర్గి జిల్లాలో ఉన్న అలంద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 6,018 ఓట్లు డిలీట్ అయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. సాఫ్ట్‌వేర్ మానిప్యులేషన్, ఫేక్ అప్లికేషన్లతో ఈ ప్రక్రియ చేపట్టినట్లు పేర్కొన్నారు. ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించారని పేర్కొన్నారు. ‘ఒక బూత్ లెవల్ అధికారి తన మామగారి ఓటు తొలగించబడిందని గమనించింది. పరిశీలించగా తన పొరుగువాడి లాగిన్ నుండి అది జరిగిందని తెలిసింది. కానీ ఆ పొరుగువాడికి కూడా తెలియదు. మామగారికి కూడా తెలియదు. ఇలా ఈ కుంభకోణం బయటపడింది’ అని ఆయన వివరించారు.
సీఈసీపై విమర్శలు
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై కూడా రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు. ‘కర్ణాటక సీఐడీ 18 నెలల్లో 18 లేఖలు పంపింది. ఓటర్ల తొలగింపు ఫారమ్‌లను నింపిన పరికరాల IP అడ్రస్‌లు, OTP ట్రైల్స్ వంటి సమాచారం కోరింది. కానీ ఎన్నికల సంఘం వాటిని ఇవ్వలేదు. ఇస్తే ఈ ఆపరేషన్ మూలాలు ఎక్కడున్నాయో బయటపడుతుందని భయం. జ్ఞానేష్ కుమార్ ఈ నేరస్థులను రక్షిస్తున్నాడనే పక్కా ఆధారం ఇది’ అని ఆయన అన్నారు. ‘జ్ఞానేశ్ కుమార్ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్న వారిని రక్షించడం ఆపాలి. ఎన్నికల సంఘం ఈ డేటాను వారం రోజుల్లో బయటపెట్టాలి. లేకపోతే ఆయన వారిని కాపాడుతున్నారణ నిర్ధారణకు రావాల్సి ఉంటుంది. వారంలో కర్ణాటక సీఐడీ అధికారులు.. దీనికి సంబంధించి ఆధారాలు అందజేయాలి’ అని రాహుల్ గాంధీ సూచించారు.
Also Read: Horror Hostle: అమ్మబాబోయ్ హాస్టల్లో దెయ్యం.. రాత్రిళ్లు వింత శబ్దాలు.. వణికిపోతున్న విద్యార్థులు!
దేశ యువతను ఉద్దేశిస్తూ..
రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ యువతను ఉద్దేశించి మాట్లాడారు. ‘ఇదే మీ భవిష్యత్తు. వీరు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇవ్వకుండా దాచిపెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నవారిని కాపాడుతున్నట్టే’ అని రాహుల్ ఆరోపించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యలో రాహుల్.. కొంతమందిని తీసుకువచ్చి చూపించారు. వారి ఫోన్ నంబర్లను ఉపయోగించి ఓటర్లను తొలగించినట్లు ఆరోపించారు. కానీ ఆ వ్యక్తులకు దీని గురించి ఏమీ తెలియదని రాహుల్ చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల పేర్లు జోడించబడితే.. మరికొన్నింటిలో తొలగించబడ్డాయని కానీ పద్ధతి మాత్రం ఒకటే అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.