Telangana Land Scam: రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో భూమి విలువ అధికంగా ఉండడంతో, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. చట్టాలను పేదవాడిపై కఠినంగా అమలు చేసే అధికారులు, ఆర్థిక, అంగబలం ఉన్న పెద్దల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా, గత ప్రభుత్వాల హయాంలో కోట్ల విలువైన సీలింగ్ భూములను రాజకీయ ప్రభావంతో, పత్రాలను తారుమారు చేసి పట్టా భూములుగా మార్చుకున్న సంఘటనలు అనేకం ఉన్నట్లు సమాచారం.
Also Raed: Bachupally Land Scam: బాచుపల్లిలో బడా భూస్కాం.. పైల్ డీ నోటిఫై చేసేందుకు అధికారుల తంటాలు
ఆర్డీవోల చొరవతో ‘క్లియరెన్స్
గత ప్రభుత్వంలో పనిచేసిన కొందరు ఆర్డీవోల కారణంగానే సంపన్నులకు సీలింగ్ భూములకు సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికేట్స్ జారీ అయినట్లు తెలుస్తుంది. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చేసుకుని, ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించి సీలింగ్ భూములను పట్టా భూములుగా మార్చుకున్నారు. ఇప్పటికే కొన్ని భూముల్లో లేఅవుట్లు వేసి క్రయవిక్రయాలు నిర్వహించగా, మరికొన్నింటిలో నిర్మాణాలకు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పేరుగాంచిన పెద్ద కన్ స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ సంస్థలే ఈ సీలింగ్ భూములను కొనుగోలు చేయడం దారుణమని ఈ కథనంలో పేర్కొన్నారు.
సీలింగ్ భూములను వదిలేస్తున్నారా?
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూమి విలువ పెరుగుతూ వచ్చిన నేపథ్యంలో, ధరణి వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చాక ఏఏ భూములను పట్టా భూములుగా మార్చుకోవచ్చో రియల్ మాఫియా కనుక్కుంది. స్థానిక నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికార పార్టీలోని నేతలతో కుమ్మక్కై అధికారులను ప్రభావితం చేస్తున్నారనే ఆపవాదం ఉంది. ఫలితంగా, సీలింగ్ భూములకు సంబంధించిన వివరాలను ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడం, ఫిర్యాదులు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరుగుతోందని తెలుస్తుంది. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే స్వయంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ రెవెన్యూ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలున్నాయి.
ఎకరం రూ.20 కోట్ల పైమాటే
రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, అబ్ధుల్లాపూర్ మెట్టు, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో పదుల సంఖ్యల్లోని ఎకరాల సీలింగ్ భూమి అన్యాక్రాంతమవుతుంది. ప్రభుత్వాలు మారినప్పటికీ అధికారుల పనితీరులో మార్పు లేదని స్పష్టమవుతుంది. ప్రభుత్వ భూములను కాపాడటంలో అధికారులు విఫలమవుతున్నారని, ఈ అధికారులపై రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందనే ప్రచారం కొనసాగుతుంది. ప్రభుత్వ అవసరాలకు భూమి దొరకనప్పుడు పట్టాదారుల నుంచి లక్షలు పెట్టి సేకరిస్తున్న ప్రభుత్వం, విలువైన భూములను కాపాడటంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
విచారణ లేని కీలక సర్వే నెంబర్లు
– ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెం. 272-283 పరిధిలోని సుమారు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఓ పేరుగాంచిన రియల్ కంపెనీకి అప్పగించారు. ఈ భూమిని గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రి ఒకరు క్రమబద్ధీకరించి విక్రయించినట్లు, దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
– ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల రెవెన్యూ పరిధిలోని 13 ఎకరాల సీలింగ్ భూమిని 38ఈ కింద బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు క్రమబద్ధీకరించుకొని పట్టా తీసుకున్నారు. దీనిపై కూడా ఫిర్యాదులు ఉన్నాయి.
– శంషాబాద్ మండలం శంకరపురం సర్వే నెం. 24 పరిధిలోని సుమారు 50 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, ఇందులో 20 ఎకరాల భూమిని ఒక వ్యాపారి ఆక్రమించి లేఅవుట్ నిర్మిస్తున్నట్లు సమాచారం.
– అబ్ధుల్లాపూర్మెట్టు మండలం అనాజ్ పురం సర్వే నెం. 281 పరిధిలో ఇక్కడ ఉన్న సుమారు 357.39 ఎకరాల భూమిలో ప్రభుత్వ, పట్టా, సీలింగ్ భూములు ఉన్నాయి. పట్టా భూమి పేరుతో పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జాచేసే కుట్ర జరుగుతుందని, ప్రకృతి సహజమైన కొండలు, గుట్టలను నెలమట్టం చేసే కార్యక్రమానికి సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.
Also Raed: Land Scams: ఆగని భూముల రిజిస్ట్రేషన్లు.. మరిన్ని వివాదాలకు ఆజ్యం పోస్తున్న డిప్యూటీ తహశీల్ధార్లు!
