MLA Anirudh Reddy: కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఇతర పార్టీల వారు దాడులకు పాల్పడితే తాను చూస్తూ ఊరుకోనని, తమ కార్యకర్తలను టచ్ చేస్తే తాను కూడా కన్నెర్ర చేయాల్సి వస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(MLA Janampalli Anirudh Reddy) హెచ్చరించారు. అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఎలాంటి ప్రతీకా దాడులకు పాల్పడకూడదని, అలా చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు. సమాజంలో శాంతి భద్రతలు ప్రధానమని వ్యాఖ్యానించారు. మూడవ విడత పంచాయితీ ఎన్నికలు ముగిసిన తర్వాత గురువారం జడ్చర్ల మండలంలోని నస్రుల్లాబాద్ తాండలో బీఆర్ఎస్- కాంగ్రెస్ వర్గీయుల మధ్య, అలాగే గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్-బీజేపీ వర్గీయుల మధ్య దాడులు, గొడవలు జరిగిన నేపథ్యంలో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి
కాంగ్రెస్ పార్టీ వారు రౌడీయిజం చేస్తున్నారని కేటీఆర్(KTR) అంటున్నారని, అయితే నస్రుల్లాబాద్ తాండలో కాంగ్రెష్ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు గొడ్డలితో దాడి చేసారని రౌడీయిజం ఎవరు చేస్తున్నారో కేటీఆర్ ఇప్పుడు చెప్పాలని కోరారు. ఇదేనా మీ బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అని నిలదీసారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహబూబ్ నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో ఎంత అరాచకాలు చేసారో అందరికీ తెలుసునని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు రౌడీయిజం, భూకబ్జాలు చేసి కోట్లాది రుపాయలు సంపాదించుకొని ఆ సొమ్ముతో పంచాయితీ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నించారని, అయితే ప్రజలు వారికి ఓట్లు వేయకుండా బుద్ధి చెప్పారని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తమ ప్రభుత్వం ఇస్తున్న ఏడవ గ్యారెంటీ స్వేచ్ఛ అని చెప్పారని, దానికి తాము కూడా కట్టుబడి ఉంటామని చెప్పారు. అలాగని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని, వారిపై తాము కూడా కన్నెర్ర చేయాల్సి వస్తుందని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: Telegram App: ఈ యాప్‌లో అన్నీ సాధ్యమే.. పైరసీ సినిమాలు.. అన్‌లైన్ బెట్టింగ్‌లు!
అలా చేస్తే మీపై కూడా చర్యలు
గొల్లపల్లిలో కూడా బీజేపీ(BLP), కాంగ్రెస్(Congress) వర్గాల మధ్య గొడవ జరిగిందని ఈ విషయం తన దృష్టికి వచ్చిన తర్వాత తాను గొల్లపల్లిలో గెలిచిన బీజేపీ సర్పంచ్ అభ్యర్థి తోనూ మాట్లాడి వారికి ఏ ఇబ్బంది జరగనివ్వకుండా చూస్తానని హామీ ఇచ్చానని వెల్లడించారు. అలాగే ఆ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులతోనూ మాట్లాడానని ఎవరిపైన కూడా దాడులకు దిగవద్దని అలా చేస్తే మీపై కూడా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించానని చెప్పారు. శాంతి భద్రతలు ప్రధానమని స్పష్టం చేసానని తెలిపారు. ప్రజాస్వామంపై నమ్మకం ఉంచి గెలిచిన వారిని గౌరవించాలని, ఓడిన బాధలో ఉన్నవారికి సపోర్టుగా ఉండాలని అన్ని రాజకీయ పక్షాలకు అనిరుధ్ రెడ్డి విజప్తి చేసారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా ఎలాంటి గొడవలు జరగకుండా నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడుకుంటూ వస్తున్నామని అనిరుధ్ రెడ్డి చెప్పారు. గొడవలకు ఎవరు దిగినా సహించేది లేదని పేర్కొన్నారు. జరుగుతున్న గొడవలకు కేటీఆర్ కారణమని తాను చెప్పడం లేదని బీఆర్ఎస్ పార్టీ పెంచి పోషించిన రౌడీలు దీనికి కారణమని ఒక ప్రశ్నకు బదులుగా అనిరుధ్ స్పష్టీకరించారు.
Also Read: Mysterious Review: ‘మిస్టీరియస్’ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించింది?.. రివ్యూ..

