Taliban leader: ఆఫ్ఘనిస్తాన్ ఇస్లామిక్ ఎమిరేట్ కీలక నేత, తాలిబాన్ ఉద్యమానికి చెందిన నాయకుడు అనస్ హక్కానీకి (Taliban leader) క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఈ క్రీడపై ఆయన ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తుంటారు. అంత పెద్ద క్రికెట్ ఫ్యాన్ అయిన అనస్ హక్కానీ, ఇటీవల భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరిద్దరి రిటైర్మెంట్‌పై తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం గురించి తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు.
కోహ్లీకి 50 ఏళ్లు వచ్చే వరకు క్రికెట్ ఆడాలనేది తన కోరిక అని అనస్ హక్కానీ చెప్పారు. రోహిత్ టెస్టుల నుంచి రిటైర్ కావడం సమంజసమేనని వ్యాఖ్యానించారు. కానీ, కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణం తనకు తెలియదన్నారు. ప్రపంచంలో అతికొద్ది మంది మాత్రమే కోహ్లీ లాంటివారు ఉంటారని, విరాట్‌కు 50 ఏళ్లు వచ్చే వరకు ఆడాలని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ప్రముఖ యూట్యూబర్ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనస్ హక్కానీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఈ ఏడాది మే నెలలో, ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు టెస్ట్ కెరీర్లకు వీడ్కోలు ప్రకటించారు.
కోహ్లీ రిటైర్మెంట్ అందుకేనేమో..
బహుశా భారత మీడియా పట్ల విసుగు చెంది విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడేమోనని అనస్ హక్కానీ వ్యాఖ్యానించారు. కోహ్లీ రిటైర్‌మెంట్‌కు ఇంకా సమయం ఉందన్నారు. ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ టెస్ట్ రన్స్ రికార్డ్‌ను ఛేదించే ప్రయత్నంలో ఉన్నాడని అనస్ హక్కానీ వ్యాఖ్యానించారు. కాగా, విరాట్ కోహ్లీ 36 ఏళ్ల వయసులో, ఈ ఏడాది మే 12న టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కోహ్లీకి ఇంకా 770 పరుగుల దూరంలోనే ఉన్నాడు. ఈ సమయంలో టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
Read Also- Narendra Modi: నేను శివ భక్తుడిని.. దూషణల విషాన్ని కూడా తాగగలను: ప్రధాని మోదీ
మరోవైపు, కోహ్లీ రిటైర్మెంట్‌కు 5 రోజుల ముందు, అంటే 2025 మే 7న రోహిత్ శర్మ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. వీరిద్దరి రిటైర్మెంట్స్ తర్వాత యువక్రికెటర్ శుభ్‌మన్ గిల్ భారత టెస్ట్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అతడి నాయకత్వంలో టీమిండియా.. ఇంగ్లాండ్ గడ్డపై 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు. టీ20 ప్రపంచ కప్‌ను టీమిండియా ముద్దాడిన తర్వాత ఇద్దరూ టీ20 క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికారు. ఇక, అక్టోబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు వీరిద్దరూ తిరిగి జట్టులోకి రానున్నారు.