AUS vs IND 4th T20I: భారత్ – ఆసీస్ మధ్య నేడు నాల్గో టీ20 జరగనుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. రెండో మ్యాచ్ లో ఆస్ట్రేలియా.. మూడో టీ-20లో భారత్ విజయం సాధించి సిరీస్ లో సమంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాల్గో టీ-20లో విజయం సాధించి సిరీస్ పై పట్టు సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. క్వీన్స్ ల్యాండ్ లోని కరారా ఓవల్ మైదానం (Carrara Oval Staduim)లో మధ్యాహ్నం 1.45 గం.లకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలు, జట్టులో జరగబోయో మార్పులు, గెలుపు అవకాశాలు గురించి పరిశీలిద్దాం.
కుల్దీప్ ఔట్.. మరి గిల్?
నాల్గో టీ20 కోసం భారత జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడో టీ20కి గైర్హాజరైన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఈ మ్యాచ్ లోనూ అందుబాటులో ఉండకపోవచ్చు. దక్షిణాఫ్రికా – Aతో భారత్ – A జట్టు ఆడే అనధికారిక టెస్టు కోసం కుల్దీప్ ను పంపడంతో.. రాబోయే నాల్గో టీ20తో పాటు 5వ మ్యాచ్ కు సైతం కుల్దీప్ అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక జట్టు స్పిన్ భారాన్ని ఆల్ రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ మోయాల్సి ఉంటుంది. మరోవైపు గత మ్యాచుల్లో విఫలమైన ఓపెనర్ గిల్ ను ఈ మ్యాచ్ లో పక్కన పెట్టొచ్చని ప్రచారం ఊపందుకుంది. అయితే వైస్ కెప్టెన్ అయినందువల్ల అతడిపై వేటు పడే ఛాన్స్ లేదు. మరోవైపు గత మ్యాచ్ లో రాణించిన జితేశ్ శర్మనే వికెట్ కీపర్ గా కొనసాగించే అవకాశముంది.
ట్రావిస్ హెడ్ దూరం..
నాల్గో టీ20కి ముందు ఆస్ట్రేలియా జట్టు తమ స్క్వాడ్‌లో ముఖ్యమైన మార్పు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను.. షెఫీల్డ్ షీల్డ్ టోర్నమెంట్‌లో దక్షిణ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడానికి విడుదల చేశారు. నవంబర్ 21న ప్రారంభమయ్యే యాషెస్ టెస్ట్ సిరీస్ కోసం అతడు సన్నద్ధం కానున్నాడు. కెప్టెన్ మిచెల్ మార్ష్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు కొత్త ఓపెనర్ కోసం ఎదురు చూస్తోంది. మరోవైపు ట్రావిస్ హెడ్ దూరం కావడంతో టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్ లాంటి పవర్‌హిట్టర్లపై ఆసీస్ ఆధారపడనుంది.
టీ20ల్లో ఎవరిది పైచేయి
టీ20ల్లో ఆస్ట్రేలియాపై భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ 35 టీ20లు జరగ్గా.. అందులో భారత్ 21 మ్యాచులు గెలిచింది. ఆస్ట్రేలియా 12 మ్యాచులను కైవసం చేసుకుంది. డ్రాగా ముగిసిన మ్యాచ్ లు రెండు ఉన్నాయి.
పిచ్ రిపోర్ట్
ఓవల్ మైదానంలో నాల్గో టీ20 జరగనుంది. పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది బౌలింగ్ పిచ్ అని క్యూరేటర్లు చెబుతున్నారు. అయితే నిలదొక్కుకుంటే బ్యాటర్లు రాణించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ గ్రౌండ్ లో 9 టీ20 మ్యాచ్ లు జరగ్గా 4 జట్లు తొలుత బ్యాటింగ్ చేసి గెలిచాయి. మరో నాలుగు టీమ్స్ ఛేజ్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఓవల్ మైదానంలో సగటు స్కోరు 123. రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన వారి సగటు స్కోరు 109 మాత్రమే. గత మ్యాచులను పరిశీలిస్తే నాల్గో టీ20లో హైస్కోరును చూసే అవకాశం తక్కువేనని సమాచారం. స్పిన్నర్లు, మీడియం పేసర్లకు మిడిల్ ఓవర్లలో పిచ్ నుంచి మంచి సహకారం లభించనుంది. ఛేజింగ్ లో పరుగులు రాబట్టడం కాస్త కష్టంగా ఉండొచ్చని తెలుస్తోంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Also Read: Donald Trump: ఓరి బాబోయ్ మళ్లీ గెలికేసిన ట్రంప్.. భారత్ – పాక్ ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు
నాల్గో టీ20 మ్యాచ్ అంచనా
టాస్ గెలిచి ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో 35-45 పరుగులు చేయవచ్చు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 140-150 రన్స్ చేసే అవకాశముంది. అలాకాకుండా భారత్ గనుక ఫస్ట్ బ్యాటింగ్ కు దిగితే పవర్ ప్లేలో 40-50 రన్స్ చేయవచ్చని క్రీడా నిపుణుల అంచనా. మెుత్తంగా 150-160 రన్స్ ను భారత జట్టు చేస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన జట్టుకు గెలుపు అవకాశాలు మెండుగా ఉంటాయని క్రీడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
