KCR: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఇక మూడు రోజులే మిగిలి ఉన్నది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. బీఆర్ఎస్(BRS) పార్టీ సైతం ప్రచారం స్పీడ్ పెంచింది. అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారా? రారా? అనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. కేసీఆర్ వస్తే ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని, పార్టీ క్యాడర్‌లోనూ జోష్ పెరుగుతుందని, పార్టీ గెలుపు సునాయసం అవుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే, నేటి వరకు పార్టీ నేతలకు సైతం పార్టీ క్లారిటీ ఇవ్వలేదని సమాచారం.
కేసీఆర్ వస్తే పార్టీకి ప్లస్ అవుతుందని..
కేసీఆర్ ప్రచారానికి వస్తే.. ఆయన ప్రత్యర్థులపై చేసే కామెంట్లు, విమర్శలు.. సామెతలు ప్రజలను ఆకట్టుకుంటాయి. ఒక్కసారిగా పార్టీకి జోష్ వస్తుంది. అంతేకాదు ఆయన చేసే వ్యాఖ్యలకు ప్రజలు సైతం ఆకర్షితులవుతారు. దీంతో పార్టీ విజయం ఖాయమవుతుందని నేతలు సైతం పేర్కొంటున్నాయి. అయితే జూబ్లీహిల్స్ ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత కేసీఆర్ ప్రచారానికి వస్తారని పార్టీ పేర్కొంది. నేతలకు సైతం హింట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎర్రవెల్లి నివాసంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో మాత్రం కేసీఆర్(KCR) ప్రచారంపై స్పష్టత ఇవ్వలేదు. నేతలు సమిష్టిగా పనిచేయాలని, గెలుపు మనదేని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలంతా ఆగ్రహంగా ఉన్నారని, మనవైపు చూస్తున్నారని.. కాంగ్రెస్ రెండేళ్లలో వైఫల్యం చెందిందని విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నిత్యం మానిటరింగ్ చేయాలని సూచించారు. ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన స్టార్ క్యాంపెయిన్ లిస్టులో సైతం కేసీఆర్ పేరు చేర్చారు. అయితే నియోజకవర్గంలోని క్యాడర్ అంతా ఎదురుచూస్తున్నారు. రోడ్డు షోలు నిర్వహిస్తే పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. ఆశతో ఉన్నప్పటికీ ఇప్పటివరకు పార్టీ మాత్రం ఇంకా ప్రచారంను సస్పెన్స్‌లోనే పెట్టింది.
Also Read: Bhadrachalam: భద్రాచలంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు.. భూకంప జోన్‌లో ప్రాణాలకు రక్షణ కరువు!
మీడియా ముందుకు రావడం లేదు…
వరంగల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సభ నిర్వహించింది. ఆ సభలో కేసీఆర్ ప్రసంగం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ మళ్లీ జనాల్లోకి రాలేదు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. పార్టీ నేతలతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేస్తుండటం, ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడాలని సూచనలు చేస్తున్నారు. అంతే తప్ప మీడియా ముందుకు గానీ, ప్రజల్లోకి గానీ రావడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా పార్టీ తీసుకోవడం, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఇది నాంది అని, ఇక్కడి నుంచే పార్టీ జైత్రయాత్ర స్టార్ట్ అవుతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్య కావడానికి ఇదే తొలి అడుగు అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. అంత కీలకంగా మారిన ఉప ఎన్నిక ప్రచారానికి కేసీఆర్ రాకపై క్లారిటీ రాలేదు. ప్రచారానికి వచ్చి పార్టీ క్యాడర్‌లో జోష్ నింపాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హరీశ్‌రావు మూడు రోజుల ప్రచారం!
హరీశ్ రావు(Harish Rao) తండ్రి సత్యనారాయణరావు మృతితో ఇంటికే పరిమితం అయ్యారు. ఈ నెల 9వ తేదీ వరకు ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. మూడురోజులు పర్యటన మాత్రమే ఉండటంతో ఆయన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో ఏ డివిజన్లలో ఏయే డివిజన్లలో కార్నర్ మీటింగ్స్ నిర్వహించాలా? లేకుంటే రోడ్ షోలు నిర్వహించాలా? అనేదానిపై ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మూడు రోజులు కీలకం కావడంతో హరీశ్ రావు(Harish Rao)ను రంగంలోకి దింపేందుకు పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.
కేసీఆర్ ప్రచారంపైనే గులాబీ నేతలు ఆశలు
ఇది ఇలా ఉంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేపడుతుంది. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తుంది. ఓటర్ క్యాంపెయిన్ విస్తృతంగా చేపట్టింది. నిత్యం నేతల ప్రచార సరళిపై ఆరా తీస్తుంది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సూచనలు ఇస్తుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రచారంపైనే గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు.
