AICC: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఏఐసీసీ ఆరా తీసింది. ఇన్ చార్జ్ మంత్రుల నుంచి లేటెస్టు రిపోర్టును సేకరించింది. ఆ సెగ్మెంట్ లో ప్రచార సరళి, ఓటర్ల కన్విన్స్ చేసే తీరుపై ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథ్, విశ్వనాధమ్ లు రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నారు. డివిజన్ల వారీగా కాంగ్రెస్ ప్రభావం ఎలా ఉన్నదని ఇన్ చార్జ్ మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. కొన్ని డివిజన్ల ప్రచారంపై ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. రూరల్ సెగ్మెంట్ ల తరహాలో ఇక్కడ పనిచేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని సున్నితంగానే ఇన్ ఛార్జ్ మంత్రులకు సూచన చేసినట్లు తెలిసింది. అర్బన్ ఓటర్లు ఆకట్టుకునే విధంగా పనిచేయాలని ఆదేశించారు. మరోవైపు ఇప్పటి వరకు డివిజన్లలో జరిగిన ప్రచారం తీరు, పార్టీ మైలేజ్, అభ్యర్ధి గ్రాఫ్ వంటి వివరాలను వెంటనే ఇవ్వాలని ఏఐసీసీ కార్యదర్శి కోరినట్లు తెలిసింది. వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించ వద్దని నొక్కి చెప్పారు.
Also Read: AICC: యూత్ లీడర్స్ కే చాన్స్ … ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఢిల్లీలో డిస్కషన్
7 డివిజన్లు 14 మంది మంత్రులు?
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఒక్కో డివిజన్ కు ఇద్దరు మంత్రులు చొప్పున పనిచేస్తున్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు, బోరబండలో మంత్రులు సీతక్క, ఎంపీ మల్లు రవి, వెంగళ్ రావు నగర్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సోమాజిగూడలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్ పేట్ లో వివేక్, కొండా సురేఖ, యూసప్ గూడ మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, రహమత్ నగర్ లో మంత్రి కోమటిరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ టీమ్స్, 35 మంది కార్పొరేషన్ చైర్మన్లు తో పాటు మరి కొంత మంది క్రీయాశీలక కార్యకర్తలూ పనిచేస్తున్నారు. అయితే కొన్ని డివిజన్లలో పార్టీకి ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదని, ప్రచారం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాధ్ సూచించినట్లు తెలిసింది. ఇక ఇప్పటివరకు డివిజన్లలో ఏం చేశారు?ఎంత మంది ఓటర్లను కలిశారు?వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చింది అనే అంశాలపై ప్రతి ఒక్క ఇన్-చార్జ్‌ను నిలదీసినట్లు సమాచారం.
రోడ్ షోలు కంటే గడప ప్రచారాలు బెటర్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఉపఎన్నిక ఫలితం, ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయానికి నిదర్శనంగా ఉంటుందని భావిస్తున్న అధిష్ఠానం, ఇక్కడ గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సారించింది. క్షేత్రస్థాయి ప్రచార సరళి, పార్టీ నేతల పనితీరుపై కఠినమైన నిఘా ఉంచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.ప్రచారంలో రోడ్ షోలు కంటే గడపగడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ముందుకు సాగాలని ఏఐసీసీ సెక్రటరీ సూచించారు.మరోవైపు ఏఐసీసీ కేవలం నివేదికలు తీసుకోవడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు, ఓటర్లను కన్విన్స్ చేసే తీరు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న విధానంపై కార్యదర్శులు స్వయంగా నిఘా పెడుతున్నారు. ప్రతి డివిజన్లో పార్టీ పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, ప్రచారం తీరుపై అధిష్ఠానం ప్రతి గంటకు అప్‌డేట్‌లను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నగర ఓటర్ల దృష్టిని ఆకర్షించే సామాజిక మాధ్యమాలు, ఇంటింటి ప్రచారంపై మరింత దృష్టి పెట్టాలని కార్యదర్శులు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
Also Read: AICC – Telangana Cabinet: ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్.. ఉగాదిలోపే కొత్త మంత్రులు!
