ISRO CMS-03: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఆదివారం మరో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటివరకు ప్రయోగించిన ఉపగ్రహల్లో కల్లా అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ అయిన సీఎంఎస్-03 (CMS-03)ను సక్సెస్‌ఫుల్‌గా ప్రయోగించింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ‘బాహుబలి’గా అభివర్ణించే శక్తివంతమైన ఎల్‌వీఎం-3 (LVM-3) రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి సాయంత్రం 5:26 గంటలకు ప్రయోగించారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ దూసుకెళ్లింది. ప్రయోగించిన 16 నిమిషాలకు అంతరిక్షంలో ఎల్‌వీఎం-3 నుంచి శాటిలైట్ విడిపోయింది. ఇంత బరువైన ప్రయోగాన్ని పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో చేపట్టారు. ఈ శాటిలైట్ సేవలు అందుబాటులోకి వస్తే సముద్ర కమ్యూనికేషన్లలో నూతన శకం మొదలైనట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశ స్వదేశీ ఉపగ్రహ సామర్థ్యాలు, సముద్ర భద్రతకు సంబంధించి ఒక ముఖ్యమైన ముందడుగు అని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also- Baahubali The Epic Collections Day 2: ‘బాహుబలి: ది ఎపిక్’ రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?
నేవీ కమ్యూనికేషన్ గ్రిడ్‌కు ఊతం
సీఎంఎస్-03 శాటిలైట్‌ను జీశాట్7ఆర్ (GSAT-7R) అని కూడా పిలుస్తారు. ఇది హిందూ మహాసముద్రం అంతటా ఇండియన్ నేవీ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు వెన్నెముకలా పనిచేసేలా ఈ శాటిలైట్‌ను తయారు చేశారు. ఇందులో సీ, ఎక్స్‌టెండెడ్ సీ, కేయూ బ్యాండ్‌లతో పాటు మల్టీ-బ్యాండ్ పేలోడ్‌లు ఉన్నాయి. ఇవి యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, విమానాలు, తీరప్రాంత కమాండ్ కేంద్రాల మధ్య సురక్షితమైన, అధిక-సామర్థ్యంతో వాయిస్, డేటా, వీడియో ట్రాన్స్‌మిషన్స్‌ను సాధ్యం చేస్తాయి. శాటిలైట్ పాత వెర్షన్ జీశాట్-7 (రుక్మిణి)తో పోల్చితే, సీఎంఎస్-03 ఎక్కువ కవరేజీని, బ్యాండ్‌విడ్త్‌ను అందిస్తుంది. ఈ శాటిలైట్ మారుమూల ప్రాంతాలు, వివాదాస్పద సముద్ర తలాలపై కూడా రియల్-టైమ్ కనెక్టివిటీని కచ్చితత్వంతో అందిస్తుంది.
Read Also- India victory: వాషింగ్టన్ సుందర్ మెరుపులు.. ఆసీస్‌పై టీమిండియా సునాయాస విజయం
సీఎంఎస్-3 శాటిలైట్ నెట్‌వర్క్-సెంట్రిక్ నౌకాదళ కార్యకలాపాలకు మరింత ఊతమిస్తుంది. సముద్ర పరిస్థితులపై నేవీకి అవగాహనను పెంచుతుంది. భారత బ్లూ-వాటర్ ఆశయాలకు (సముద్ర లక్ష్యాలు) ఎంతగానో తోడ్పడుతుంది. సముద్రంలో దూర ప్రాంతాలలో బెదిరింపులు ఎదురైనా సమన్వయంతో ప్రతిస్పందించడానికి, నౌకాదళం మధ్య మరింత సమన్వయానికి దోహదపడుతుంది. సురక్షితమైన సమాచార మార్పిడికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే, ఈ నేవీ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ గ్రిడ్‌లో ఈ శాటిలైట్ ఒక ముఖ్యమైనదిగా నిలుస్తుంది.
సీఎంఎస్-03 శాటిలైట్ కవరేజీ భారత ఉపఖండంతో పాటు చుట్టుపక్కల ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది సాధారణ భూ-ఆధారిత నెట్‌వర్క్‌ల పరిధికి మించి అని చెప్పారు. నిరంతరాయం జియోసింక్రోనస్ పొజిషన్‌లో ఉండటంతో సాయుధ దళాలకు, డిజాస్టర్ రెస్పాన్స్, రిమోట్ సెన్సింగ్, టెలిమెడిసిన్‌లో సేవలు అందించే ఏజెన్సీలకు నిరంతరాయమైన, సురక్షితమైన కమ్యూనికేషన్స్‌ను అందిస్తుందని వివరించారు.
