Uttarkashi: ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ లు, మెరుపు వరదలు.. మంగళవారం బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఉత్తర కాశీ జిల్లాలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. నదులు ఉప్పొంగడంతో పలువురు పర్యాటకులు గల్లంతయ్యారు. అయితే వీరిలో కేరళకు చెందిన 28 పర్యాటకుల బృందం (28 member tourist group) ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆ బృందం.. మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి బయలుదేరి వెళ్లిన క్రమంలో కనిపించకుండా పోయిందని స్పష్టం చేసింది.
వివరాల్లోకి వెళ్తే..
మంగళవారం ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీ జిల్లా ధరాలి ప్రాంతంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. ఈ భారీ నీటి ప్రవాహం.. గంగోత్రి యాత్ర మార్గం పక్కన ఉన్న ఇళ్లు, హోటళ్లు, హోమ్‌స్టేలను ముంచెత్తింది. దీంతో కేరళకు చెందిన 28 మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన కేరళవాసులని మిగిలిన 8మంది కేరళకు చెందిన వేర్వేరు జిల్లాలకు చెందిన వ్యక్తులని ఓ బాధితుడి బంధువు తెలియజేశారు.
ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించగా..
బంధువు మాట్లాడుతూ ‘ఒక రోజు క్రితం నేను వారితో మాట్లాడాను. వారు గంగోత్రి నుంచి బయలుదేరుతున్నారని చెప్పారు. అదే మార్గంలో కొండచరియలు విరిగిపడటం, వరదలు సంభవించాయి. ఇప్పుడు మేము వారిని సంప్రదించలేకపోతున్నాం. వారు బయలుదేరినప్పటి నుంచి వారితో సంబంధాలు తెగిపోయాయి’ అని వివరించారు. తమ ఫ్యామిలీకి చెందిన జంట.. హరిద్వార్ లోని ఒక ట్రావెల్ ఏజెన్సీ నుంచి 10 రోజుల క్రితం ఉత్తరాఖండ్ యాత్రకు వచ్చినట్లు బంధువులు తెలిపారు. ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించగా వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారి ఫోన్లకు బ్యాటరీ అయిపోయి ఉండవచ్చు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మొబైల్ నెట్‌వర్క్ లేదు’ అని సర్దిచెబుతున్నారని పేర్కొన్నారు.
Also Read: Raksha Bandhan: రాఖీ పండుగ ఎందుకు జరుపుకోవాలి.. రాఖీ కట్టకపోతే ఏమవుతుందో తెలుసా?
ఉత్తర కాశీలో జరిగిందిదే!
మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్ కాశీ జిల్లా ధరాలి ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. ఇది పర్యావరణం పరంగా సున్నితమైన ప్రాంతం కావడంతో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ధరాలి ప్రాంతంలో సగ భాగం మట్టి, బురద, నీటి ప్రవాహంతో నిండిపోయింది. ధరాలి.. గంగోత్రి మార్గంలోని ప్రధాన స్టాప్‌లలో ఒకటి. ప్రతి సంవత్సరం అనేక మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. ఇదిలా ఉంటే కీర్‌గంగా నది (Kheer Ganga)లో వచ్చిన విపరీతమైన వరదల కారణంగా తొమ్మిది మంది భారత సైనికులు కూడా అదృశ్యమయ్యారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. కల్నల్ హర్షవర్ధన్ నేతృత్వంలోని 14 రాజ్ రిఫ్ బెటాలియన్‌కి చెందిన 150 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై దృష్టి సారించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీతో మాట్లాడారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు.