Sonia Gandhi: జాతీయ ఉపాధి హామీ పథకం (MNREGA) చట్టం నుంచి మహాత్మగాంధీ పేరును తొలగించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టిన నేపథ్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. గాంధీ పేరు మార్పుపై సోనియా తొలిసారి స్పందిస్తూ.. మోదీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అలాగే చట్టంలో మార్పులు చేయడంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు MNREGA చట్టం గొప్పతనాన్ని వివరిస్తూనే.. కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు.
‘పేదలకు జీవనాధారం’
మహాత్మా గాంధీ పేరు మార్పుపై సోనియా గాంధీ మాట్లాడిన వీడియోను జాతీయ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అందులో సోనియా మాట్లాడుతూ.. ’20 సంవత్సరాల క్రితం మన్మోహన్ ప్రధానిగా ఉన్న సమయంలో MNREGA చట్టాన్ని పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది లక్షలాది గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే విప్లవాత్మక చర్య’ అని సోనియా అన్నారు. ముఖ్యంగా అణగారిన, దోపిడీకి గురైన పేదలకు ఈ చట్టం.. జీవనాధారంగా మారిందని గుర్తుచేశారు. ఉపాధి కోసం గ్రామాన్ని విడిచి వెళ్లాల్సిన పరిస్థితిని పూర్తిగా ప్రక్షాళన చేసిందని పేర్కొన్నారు. MNREGA చట్టం కారణంగా గ్రామాల్లోని వలసలు వరకూ నియంత్రించబడినట్లు పేర్కొన్నారు.
’11 ఏళ్లుగా చట్టం మసకబారింది’
MNREGA ద్వారా ఉపాధికి చట్టబద్దమైన హక్కు కూడా వచ్చిందని సోనియా గాంధీ అన్నారు. గ్రామ పంచాయతీలకు అధికారం ఇవ్వబడిందని గుర్తుచేశారు. ‘MNREGA ద్వారా మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్ వైపు అడుగులు పడ్డాయి’ అని సోనియా గాంధీ అన్నారు. అయితే గత 11 ఏళ్లుగా ఈ చట్టం అమలు మసకబారినట్లు ఆమె ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు, పేదలు, అణగారిన వర్గాల ప్రయోజనాలను మోదీ ప్రభుత్వం విస్మరించినట్లు చెప్పారు. ఇప్పుడు ఏకంగా MNREGAను బలహీన పరిచే కుట్రకు మోదీ సర్కార్ తెరలేపిందని మండిపడ్డారు.
‘ఇది ఏకపక్షణ నిర్ణయమే’
కరోనా సమయంలో MNREGA పేదలకు జీవనాధారంగా నిరూపించబడిందని సోనియా గాంధీ అన్నారు. అలాంటి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కుప్పకూల్చడం చాలా దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మహాత్మా గాంధీ పేరును తొలగించడమే కాకుండా MNREGA స్వభావాన్ని చర్చ లేకుండా, సంప్రదింపులు లేకుండా, ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా మార్చారు. ఇకపై దిల్లీలో కూర్చున్న ప్రభుత్వం ఎవరికి, ఎప్పుడు, ఎంత ఉపాధి ఇవ్వాలో నిర్ణయించనుంది’ అని సోనియా మండిపడ్డారు.
Also Read: Congress Leaders on BJP: వీళ్లు గాడ్సే వారసులు.. మోదీ, అమిత్ షాకు గుణపాఠం తప్పదు.. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్!
‘కేంద్రానికి ఎదుర్కొందాం’
MNREGA ప్రవేశపెట్టడం, అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషించిందన్న విషయాన్ని మరోమారు సోనియా గాంధీ గుర్తుచేశారు. ఇది ఎప్పుడూ ఏ పార్టీకి సమస్యగా మారలేదన్నారు. ఈ చట్టాన్ని బలహీనపరచడం ద్వారా మోదీ ప్రభుత్వం లక్షలాది మంది రైతులు, కార్మికులు, భూమిలేని గ్రామీణ పేదల ప్రయోజనాలను దెబ్బతీసిందని సోనియా ఆరోపించారు. ఈ దాడిని ఎదుర్కోవడానికి మనమందరం సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులు సహా బీజేపీయేతర పార్టీలకు ఆమె పిలుపునిచ్చారు.

