Congress Leaders on BJP: జాతీయ ఉపాధి హామీ (MGNREGA) పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తెలంగాణ కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబట్టింది. దీనిని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు హైదరాబాద్ పారడైజ్ ఎంజీ రోడ్డులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. గాంధీ అనే పదం వినిపిస్తేనే ప్రధాని మోదీ (PM Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)కు వణుకు పుడుతోందని విమర్శించారు.
‘యావత్ దేశాన్ని అవమానించారు’
ప్రధాని, మోదీ అమిత్ షాలు గాడ్సే వారసులని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రాజకీయంగా సోనియా గాందీ కుటుంబాన్ని ఎదుర్కొనే ధైర్యం వారికి లేదని మండిపడ్డారు. గాంధీ పేరు తొలగించడమంటే.. యావత్ దేశాన్ని అవమానించినట్లేనని అన్నారు. తమకు సంఖ్యా బలం ఉంది కదా అని పార్లమెంటులో బిల్ పాస్ చేసుకున్నారని మండిపడ్డారు. అయితే మోదీ, అమిత్ షాలు ఓ విషయం గుర్తుంచుకోవాలని.. ఈ ప్రపంచం ఉన్నంతవరకూ గాంధీ పేరు ఉంటుందని స్పష్టం చేశారు.
కోర్టులు మెుట్టికాయలు వేసినా..
2014లో అధికారంలో వచ్చిన మోదీ ఉపాధి హామీ పథకం (MGNREGA)లో కోత పెట్టారని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఇప్పుడు పేరు మార్చారంటూ దుయ్యబట్టారు. మోదీ, అమిత్ షాలు ఎన్ని కుతంత్రాలు చేసినా మహాత్మగాంధీని తమ హృదయాల నుంచి తీసివేయలేరని స్పష్టం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టులు మెుట్టికాయలు వేసినా బీజేపీకి బుద్ది రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రాజ్యాంగాన్నే మార్చే కుట్రలు చేస్తున్నారన్నారు. ‘మీరు ఎన్ని కుట్రలు చేసినా.. ఖబర్దార్ మోదీ’ అంటూ సవాలు విసిరారు. ‘మీ పప్పులు ఉడకవు, మీకు గుణపాఠం తప్పదు’ అంటూ టీపీసీసీ చీఫ్ కేంద్రంపై మండిపడ్డారు.
Also Read: India World Cup Squad: టీ20 వరల్డ్ కప్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ.. సంచలన మార్పులు
గ్రామ, గ్రామానికి వెళ్లి..
మరోవైపు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సైతం మహాత్మా గాంధీ పేరు తొలగించడాన్ని తప్పుబట్టారు. ‘సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో MGNREGA చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ద్వారా పేద వారికి పని కల్పించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్లుగా యూపీఏ ప్రభుత్వం పేదలకు రెండు పూటలా అన్నం పెడుతోంది. మోదీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టారు. ఇప్పుడు పేరు మార్చారు. రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని లేకుండా చేయాలని చూస్తున్నారు. అందరూ గ్రామ గ్రామానికి వెళ్లి మహాత్మా గాంధీ పేరు తొలగించే కుట్రలను ప్రజలకు తెలియజేయాలి’ అని కాంగ్రెస్ శ్రేణులకు శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.

