Rail Ticket Hike: మనదేశంలో సామాన్యుల ప్రయాణ సాధనం ‘ఇండియన్ రైల్వేస్’ అని అందరికీ తెలిసిందే. సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు రైలు బండి ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. తద్వారా తమపై ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటుంటారు. అందుకే, సామాన్యులను దృష్టిలో ఉంచుకొని, ఇండియన్ రైల్వేస్ టికెట్ రేట్లను పెద్దగా పెంచకుండా కొనసాగిస్తుంది. అయితే, డిసెంబర్ 26 నుంచి రైలు టికెట్ రేట్లు స్వల్పంగా (Rail Ticket Hike) పెరగబోతున్నాయి. సుమార ప్రయాణాలు చేసేవారికి మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. జనరల్ క్లాస్ బోగీలో 215 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించేవారిపై ఈ పెంపు ప్రభావం ఉండదు. అయితే, 215 కిలోమీటర్ల దాటి ప్రయాణిస్తే మాత్రం, ప్రతి కిలోమీటర్‌పై ఒక్కో పైసా చొప్పున టికెట్ రేటు పెరుగుతుంది. అదే, మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని నాన్-ఏసీ కోచ్‌లలో జర్నీపై ఈ పెంపు ప్రతి కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున పెరుగుతుంది. అంటే, నాన్-ఏసీ కోచ్‌లలో 500 కిలోమీటర్ల ప్రయాణానికి ప్యాసింజర్లు అదనంగా రూ.10 మేర ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది.
ఏసీ కోచ్‌లలో 2 పైసలు
ఏసీ కోచ్‌లలో (AC Classes) ప్రయాణ టికెట్ రేటును కిలోమీటర్‌కు 2 పైసలు చొప్పున పెంచినట్టు ఇండియన్ రైల్వే తెలిపింది. అయితే, సబర్బన్ అంటే, లోకల్ రైలు ప్యాసింజర్లు, తక్కువ దూరాలు ప్రయాణం చేసేవారిపై ఈ పెంపు నుంచి భారతీయ రైల్వే మినహాయింపు ఇచ్చింది. కాగా, గతేడాది జులైలో కూడా రైలు టికెట్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. మెయిల్ లేదా, ఎక్స్‌ప్రెస్ నాన్-ఏసీలో కిలో మీటర్‌కు. 1 పైసా, ఏసీలో 2 పైసలు చొప్పున టికెట్ రేట్లు పెరిగాయి. అంతకుముందు 2020 జనవరి నెలలో పెరిగాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో 1 పైసా, మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్‌లో 2 పైసలు, స్లీపర్‌లో 2, ఏసీ క్లాసుల్లో 4 పైసల చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో కలిపి ఐదేళ్ల వ్యవధిలో మొత్తం మూడు సార్లు టికెట్ రేట్లు పెరిగినట్టు అయింది.
Read Also- Bhatti Vikramarka: బడ్జెట్ ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ.. జనవరి 3లోగా రిపోర్ట్ పంపాలని కేంద్రం ఆదేశం
పెరిగిన సిబ్బంది.. అందుకే రేట్లు పెంపు
గత దశాబ్ద కాలంలో ఇండియన్ రైల్వే నెట్‌వర్క్ చాలా పెరిగింది. అనేక ప్రాంతాలకు కొత్తగా సేవలు అందడమే కాకుండా, కొత్త రైళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. రైల్వే కార్యకలాపాలు కూడా గణనీయంగా పెరిగాయి. వీటన్నింటికి అనుగుణంగా రైల్వే సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో పెరిగారు. రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్తగా సిబ్బందిని నియమించుకుంటోంది. సిబ్బంది పెరగడంతో నిర్వహణ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయని, అందుకే టికెట్ రేట్లను పెంచినట్టు ఇండియన్ రైల్వేస్ వెల్లడించింది.
ఆర్థిక సంవత్సరం 2024-25లో రైల్వే మొత్తం నిర్వహణ వ్యయం రూ.2,63,000 కోట్లకు పెరిగిందని వివరించింది. జీతాలు, పెన్షన్ల ఖర్చు కూడా చాలా ఎక్కువగా ఉంటోంది. సిబ్బంది వేతనాల కోసం రూ.1,15,000 కోట్లు, పెన్షన్లకు రూ.60,000 కోట్లకు పెరిగాయని తెలిపింది. ఇంత భారీగా పెరిగిపోయిన ఖర్చులకు అవసరమైన నిధుల కోసం రవాణా ఛార్జీలు, ప్రయాణీకుల ఛార్జీలను స్వల్పంగా సవరించినట్లు రైల్వే వివరించింది. తాజా, పెంపు ద్వారా ఏడాదికి రూ.600 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేసింది.

