Bhatti Vikramarka: తెలంగాణ రాష్ట్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను రాష్ట్ర ఆర్థిక శాఖ శనివారం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రభుత్వంలోని అన్ని శాఖలు తమ బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసి పంపాలని ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా వచ్చే ఏడాది జనవరి 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించిన ప్రభుత్వం, ఆలోపు పూర్తి వివరాలను సమర్పించాలని స్పష్టం చేసింది.
శాఖల వారీగా సమీక్షలు..
ప్రతిపాదనలు అందిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రంగంలోకి దిగనున్నారు. జనవరి రెండో వారం నుంచి ఆయన అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ భేటీల్లో ఆయా శాఖల అవసరాలు, గత కేటాయింపుల వినియోగం, కొత్త పథకాలకు అవసరమైన నిధులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. అనంతరం తుది బడ్జెట్ ప్రతులను సిద్ధం చేసి, ఫిబ్రవరి ఆఖరులో లేదా మార్చి మొదటి వారంలో శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఆదాయ అంచనాలు ఇలా..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో పన్నుల ద్వారా రూ.1.75 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, ఇప్పటివరకు దాదాపు లక్ష కోట్ల రూపాయలు వసూలైనట్లు తెలుస్తోంది. మార్చి నెలాఖరు నాటికి ఈ వసూళ్లు మరింత పుంజుకుంటాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ గణాంకాలను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఏడాది కేటాయింపులను మరింత శాస్త్రీయంగా రూపొందించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.
Also Read: SHE Teams: షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్

