SHE Teams: పోకిరీల ఆట కట్టించటానిక సైబరాబాద్ ఉమెన్, చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. దీని కోసం షీ టీమ్స్ తో డెకాయ్ ఆపరేషన్లు జరుపుతున్నాయి. మహిళలు, యువతుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న జులాయిలను రెడ్ హ్యాండెడ్ గా ఆధారాలతో సహా పట్టుకుంటున్నాయి. గడిచిన వారం రోజుల్లో కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో 137 డెకాయ్ ఆపరేషన్లు జరిపి 66మంది పోకిరీలను అరెస్ట్ చేసినట్టు ఉమెన్, చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన చెప్పారు.
మరోవైపు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అధికారులు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో హిజ్రాల గుట్టురట్టు అయ్యింది. ఆరుగురు సెక్స్ వర్కర్లు, 11మంది ట్రాన్స్ జెండర్లను అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ సృజన స్పష్టం చేశారు. ఈ క్రమంలో పీటా యాక్ట్ ప్రకారం రెండు కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. ఇక, వ్యభిచార వృత్తిలో మగ్గుతున్న ఆరుగురిని రక్షించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. అదే సమయంలో కలహాల కాపురాలను చక్కదిద్దుతున్నట్టు డీసీపీ సృజన చెప్పారు. చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతూ సంసారాలను నరకం చేసుకున్న 22 జంటలకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు, సీడీఈడబ్ల్యు కేంద్రాలకు పిలిపించి వారితో మాట్లాడటం ద్వారా సమస్యలకు పరిష్కారం చూపించినట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ జంటలు ఎలాంటి సమస్యలు లేకుండా కాపురాలను సాగిస్తున్నాయన్నారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. కానీ!
అటు మహిళలకు సంబంధించి ఉన్న చట్టాలు, హక్కుల గురించి తెలియ చేయటానికి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, షీ టీం బృందాలు కమిషనరేట్ లోని వేర్వేరు చోట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్టు డీసీపీ సృజనా పేర్కొన్నారు. వీటిల్లో మొత్తం 7,229మంది పాల్గొన్నారన్నారు. ప్రధానంగా మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, బాల కార్మికులు, వేధింపులు, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ బెదిరింపులు, మోసాలపై అవగాహన కల్పించినట్టు చెప్పారు. ఎలాంటి సమస్యలు ఉన్నా మహిళలు వారి కోసం అందుబాటులోకి తెచ్చిన హెల్ప్ లైన్ 181కు ఫోన్ చేయాలన్నారు. ఇక, చిన్నపిల్లలకు సంబంధించి చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సైబర్ క్రైం జరిగితే 1930 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

