Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ
Phone Tapping Case (Image Source: Twitter)
Telangana News

Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ.. ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం.. కానీ!

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త సిట్ తన విచారణను ప్రారంభించింది. ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే విచారణ అధికారులు మారారు గానీ, ప్రభాకర్ రావు సమాధానాలు మాత్రం మారలేదని తెలుస్తోంది. ట్యాపింగ్​ వ్యవహారంలో సూత్రధారులు ఎవరు? అన్నది బయట పెట్టించటానికి ఎన్ని ప్రశ్నలు వేసినా అంతా పైఅధికారులు చెప్పినట్టుగానే చేశానని ఆయన ప్రభాకర్ రావు సమాధానమిచ్చినట్టు సమాచారం.

ఇద్దరిద్దరుగా విడిపోయి ప్రశ్నలు!

రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్​ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చటంతోపాటు అసలు సూత్రధారులు ఎవరన్నది వెలికి తీయటానికి హైదరాబాద్ కమిషనర్​ వీ.సీ.సజ్జనార్​ నేతృత్వంలో కొత్త సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంట్లో సభ్యులుగా ఉన్న రామగుండం కమిసనర్ అంబర్ కిషోర్ ఝా, మాదాపూర్​ డీసీపీ రితిరాజ్, రాజేంద్రనగర్​ అదనపు డీసీపీ కే.ఎస్​.రావు, హెచ్​ఎంఆర్​ఎల్ డీఎస్పీ నాగేశ్వరరావు, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి మొదటి రోజు విచారణలో పాల్గొన్నారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రకారం సిట్​ అధికారులు ఇద్దరిద్దరుగా విడిపోయి ప్రభాకర్ రావును ప్రశ్నించినట్టుగా తెలిసింది. ప్రధానంగా ఎవరి ఆదేశాలతో ఫోన్ల ట్యాపింగ్ చేశారు? దీని కోసం ఆదేశాలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఎవరు? మౌఖిక ఆదేశాలు ఇచ్చారా? ఏవైనా లిఖిత పూర్వక ఆదేశాలు వచ్చాయా? అన్నదానిపై నిశితంగా విచారించినట్టు సమాచారం.

కొన్ని ప్రశ్నలకు సైలెంట్!

అలాగే హార్డ్ డిస్కులను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది? ఎవరు చెబితే చేశారు? ఎస్​ఐబీ ఆఫీస్ నుంచి కనిపించకుండా పోయిన హార్డ్ డిస్కులు ఏమయ్యాయి? ట్యాపింగ్ సమాచారాన్ని అప్​ లోడ్​ చేసిన పెన్​ డ్రైవ్​ లను ఎవరికి పంపించారు? అని అడిగినట్టు తెలిసింది. ఫోన్​ ట్యాపింగ్ సమయంలో వాడిన రెండు ఐ ఫోన్లను అమెరికాలో ఎందుకు దాచి పెట్టాల్సి వచ్చింది? అని కూడా ప్రశ్నించినట్టుగా తెలియవచ్చింది. అయితే, కీలకమైన ప్రశ్నలకు ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి జవాబులు రాలేదని తెలిసింది. కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం. అంతా పైఅధికారులకు తెలిసే జరిగిందని మాత్రం అన్నట్టుగా తెలిసింది. రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు, జర్నలిస్టుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? అసలు ఆ నెంబర్లు మీకు ఎలా వచ్చాయి? అని ప్రశ్నించినపుడు నోరు తెరవ లేదని సమాచారం. ఆ నెంబర్లన్నీ పై అధికారులతోపాటు రివ్యూ కమిటీకి తెలుసని మాత్రం అన్నట్టుగా తెలిసింది.

ఎన్ని రకాలుగా ప్రశ్నించినా..

రివ్యూ కమిటీ నుంచి అనుమతి వచ్చిన తరువాతే ఫోన్లను ట్యాప్​ చేసినట్టుగా జవాబిచ్చినట్టుగా తెలియవచ్చింది. ఆ నెంబర్లు ఎవరివన్న విషయాన్ని తెలుసుకుని రివ్యూ కమిటీ అనుమతి ఇవ్వకపోతే ట్యాపింగ్​ జరిగి ఉండేది కాదు కదా అని కూడా అన్నట్టుగా తెలిసింది. ఇదే కేసులో అరెస్టయిన ఎస్​ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్​ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను జరిపిన విచారణలో మీరు చెబితేనే అంతా చేశామని వెల్లడించిన విషయాన్ని సిట్ ప్రస్తావించింది. దీనికి మీ సమాధానం ఏంటని? అని అడిగితే నా పై అధికారులు చెప్పిందే చేశానని ప్రభాకర్​ రావు మరోమారు పునరుద్ఘటించినట్లు సమాచారం. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ప్రభాకర్ రావు పెదవి విప్పక పోవటంతో ముందు ముందు ఎఫ్​ఎస్​ఎల్ నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా మరింత నిశితంగా విచారణ జరపాలని సిట్​ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.

Also Read: KTR On Urea App: యూరియా యాప్.. సర్కార్ చేతకానితనమే.. కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

త్వరలోనే వివరాలు చెప్తాం: సజ్జనార్

అయితే ప్రభాకర్ రావు ఉపయోగించిన ఈ మెయిళ్లు, క్లౌడ్​ అకౌంట్ వివరాల కోసం ఇప్పటికే గూగుల్ కు దర్యాప్తు అధికారులు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ వివరాలు చేతికి అందితే ఫోన్ ట్యాపింగ్​ లోని కొన్ని చిక్కుముడులకు సమాధానాలు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు విచారణలోని వివరాలు బయటకు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్ తోపాటు ఏసీపీ వద్ద పని చేస్తున్న సిబ్బందిని కూడా ప్రభాకర్ రావును ప్రశ్నిస్తున్న చోటుకు అనుమతించటం లేదు. విచారణకు సంబంధించి కొత్త సిట్ ఇంఛార్జ్ వీసీ సజ్జనార్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్​ పై విచారణ మొదలైందని స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని వివరాలను వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీస్​ స్టేషన్ లో ఉన్న సిట్​ కార్యాలయాన్ని వేరే చోటుకు మార్చాలా? లేదా? అన్న ఆలోచన ఉన్నట్టుగా చెప్పారు.

Also Read: Kishan Reddy: టీడీపీపై కిషన్ రెడ్డి ఫైర్.. కూటమిలో తీవ్ర ప్రకంపనలు.. మోదీని చిక్కుల్లో పడేశారా?

Just In

01

Fake Eye Doctors: మిర్యాలగూడలో ఫేక్ కంటి డాక్టర్ల గుట్టురట్టు కలకలం.. పరారీలో ఓ ఆర్ఎంపీ.. !

Gadwal District: పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థుల మనోవేదన.. అప్పులపాలై ఆగమాగం అంటూ..!

KTR: ‘సీఎం రేవంత్‌ను ఫుట్ బాల్ ఆడుకుంటా’.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Minister Seethakka: ఉపాధి హామీ చట్టంపై కేంద్రం కుట్రలను తిప్పికొట్టాలి: మంత్రి సీతక్క

SHE Teams: షీ టీమ్స్​ డెకాయ్ ఆపరేషన్లు.. హిజ్రాల గుట్టురట్టు.. 66 మంది అరెస్ట్