Chevella Bus Accident: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కంకర లోడుతో ఉన్న టిప్పర్ రాంగ్ రూట్ లో వచ్చి ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. అయితే ప్రమాదానికి కారణమైన టిప్పర్ కు సంబంధించి సంచలన విషయం వెలుగు చూసింది.
టిప్పర్‌పై రెండు చలాన్లు..
చేవెళ్లల్లో 19మందిని పొట్టన పెట్టుకున్న టిప్పర్ పై హైదరాబాద్ లో రెండు చలాన్లు నమోదైనట్లు తాజాగా వెలుగుచూసింది. నిషేధిత సమయంలో సిటీలోకి అక్రమంగా ప్రవేశించినందుకు ఈ ఏడాది ఫిబ్రవరి, సెప్టెంబర్ లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. నగరంలోని చందానగర్ పరిధిలో ఒకసారి.. ఆర్.సి పురంలో మరోసారి ట్రాఫిక్ కు విరుద్దంగా ఈ టిప్పర్ వచ్చినట్లు వెల్లడైంది. ఉదిత్య అనిత అనే పేరుతో ఈ టిప్పర్ రిజిస్ట్రేషన్ అయినట్లు కూడా చలాన్లను బట్టి అర్దమవుతోంది. కాగా బస్సు ప్రమాద సమయంలో టిప్పర్ ఓవర్ స్పీడుతో ఉన్నట్లు తెలుస్తోంది. కంకర లోడుతో బస్సును బలంగా ఢీకొట్టడం వల్లే మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు చెబుతున్నారు.
బస్సు కండాక్టర్ మాటల్లో..
ప్రమాదంలో గాయపడ్డ బస్ కండక్టర్ రాధా.. ఘటనపై స్పందిచారు. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ వల్లే ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేశారు. ‘తప్పంతా టిప్పర్ డ్రైవర్‌దే. టిప్పర్ ఎదురుగా అతివేగంతో వస్తుండగా మా డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు కిందకు దించాడు. నేను కండక్టర్ సీట్లోనే కూర్చొని ఉన్నాను. నా ముందు ఏ సీట్లు లేవు. కంకర అంతా పూర్తిగా టిప్పర్ నుండి బస్సులో పడిపోయింది. తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నా చెయ్యి రాడ్డులో ఇరుక్కుపోయింది. స్థానికులు వచ్చి నా చేయి బయటికి తీశారు. టిప్పర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణం. మా డిపో బస్సుల్లో ఎప్పుడు ఇలా జరగలేదు’ అని ఆమె చెప్పుకొచ్చారు.
Also Read: Bus Accident Victims: చేవెళ్ల బస్సు ప్రమాదం.. భయానక అనుభవాలను పంచుకున్న బాధితులు
టిప్పర్ డ్రైవర్‌పై కేసు నమోదు
బస్సును బలంగా ఢీకొట్టి 19 మంది మరణాలకు కారణమైన టిప్పర్ డ్రైవర్ వివరాలను పోలీసులు రివీల్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన టిప్పర్ డ్రైవర్ ను ఆకాశ్ గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లచ్చా నాయక్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్.. పటాన్ చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్ కు కంకర తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ప్రమాద ఘటనపై బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకాశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 106 (1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
