Bus Accident Victims: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 19 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 14 మంది చేవెళ్లలోని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నారు. చేవెళ్ల సీహెచ్‌సీలో ముగ్గురు, స్థానిక లలితా ఆస్పత్రిలో ఇద్దరు చికిత్స పొందుతున్నారు. తమ దగ్గర వైద్యం పొందుతున్న బాధితులు.. 2, 3 రోజుల్లో కోలుకుంటారని పట్నం మహేందర్ రెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పష్టం చేశారు. ఒకరికి మాత్రం తీవ్ర గాయాలైనట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో ఉన్న బాధితులు కొందరు తమకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
‘ట్రైన్ మిస్ కావడంతో బస్ ఎక్కా’
హైదరాబాద్ లో సేల్స్ మెన్ గా చేస్తున్న బాధితుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ‘వీక్ ఆఫ్ కావడంతో ఇంటికి వచ్చాను. రెగ్యులర్గా నేను ట్రైన్ కి హైదరాబాద్ వెళ్తాను. ఈ రోజు ట్రైన్ మిస్ అవ్వడంతో బస్సుకు వెళ్లా. క్షణాల్లో ప్రమాదం జరిగింది. కంకర పూర్తిగా మా మీద పడిపోయింది. కంకర మీద పడి నా కళ్ళముందే ఐదుగురు చనిపోయారు. నేను కంకరలో పూర్తిగా కురుకుపోయాను. 20 నిమిషాల తర్వాత నన్ను బయటికి తీశారు’ అని శ్రీనివాస్ చెప్పారు.
💔 Very tragic accident near Mirzaguda, Chevella.
An RTC bus collided with a tipper, leading to the death of 21 people.Deeply painful and heartbreaking incident 🥲#Telangana #Tragedy pic.twitter.com/QTBG81QeYI
— YSR (@ysathishreddy) November 3, 2025
నా కళ్లముందే చనిపోయారు: విద్యార్థిని
బస్సు ప్రమాదంలో గాయపడ్డ ఓ విద్యార్థిని మాట్లాడుతూ ‘నేను బస్సులో నిల్చుని ఉన్నాను. ధరూర్ లో బస్సు ఎక్కాను. ప్రమాదం జరిగిన వెంటనే నేను కళ్ళు తిరిగి పడిపోయాను. బస్సులో స్టూడెంట్స్ ఎక్కువమంది ఉన్నారు. స్పాట్లో చాలామంది చనిపోయారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చీకటిగా ఉంది ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు. కంకర మొత్తం మీద పడిపోవడంతో మేము కదలలేని పరిస్థితిలోకి వెళ్లాం’ అని అన్నారు.
రోజూ ఈ బస్సులోనే వెళ్తా: నాగమణి
ప్రెస్ క్లబ్ లో పనిచేస్తున్న నాగమణి అనే మహిళ సైతం తన అనుభవాన్ని పంచుకున్నారు. ‘ప్రతిరోజు నేను ఇదే బస్సులో ప్రయాణం చేస్తుంటాను. బస్సు డ్రైవర్ తప్పు ఏమి లేదు టిప్పర్ డ్రైవర్ దే తప్పు. డ్రైవర్ పక్కన ఇంజన్ పై నేను కూర్చున్నాను. ప్రమాదం జరగగానే కిటికీల అద్దాల గుండా కంకర నాపై పడిపోయింది. నేను కంకరలో పూర్తిగా మునిగిపోయాను. చేతులు పైకి పెడుతూ కాపాడమంటూ అరిచాను. కంకరలో మునిగిపోయిన నన్ను స్థానికులు గమనించి బయటికి తీశారు’ అని నాగమణి చెప్పుకొచ్చారు.
Also Read: CM on SLBC Project: ఎస్ఎల్‍బీసీ పాపం కేసీఆర్‌దే.. హరీశ్ చిల్లరగా మాట్లాడొద్దు.. సీఎం రేవంత్ మాస్ వార్నింగ్
టిప్పర్ డ్రైవర్‌పై కేసు
బస్సును బలంగా ఢీకొట్టి 19 మంది మరణాలకు కారణమైన టిప్పర్ డ్రైవర్ వివరాలను పోలీసులు రివీల్ చేశారు. ప్రమాదంలో చనిపోయిన టిప్పర్ డ్రైవర్ ను ఆకాశ్ గా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన ఆకాశ్.. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన లచ్చా నాయక్ దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్.. పటాన్ చెరు క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్ కు కంకర తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ప్రమాద ఘటనపై బస్సు కండక్టర్ రాధా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆకాశ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 106 (1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
