My GHMC App: గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వీలైనంత త్వరగా చెత్తను తరలించేందుకు జీహెచ్ఎంసీ(GHMC) మరో సరి కొత్త వినూత్నమైన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పోగయ్యే చెత్తను తరలించే బాధ్యతను రాంకీ సంస్థతో పాటు డొమెస్టిక్ చెత్తను డోర్ టు డోర్ సేకరించేందుకు వీలుగా 2750 స్వచ్ఛ టిప్పర్ ఆటో కార్మికులకు అప్పగించినా, అధికారులు ఆశించిన టైమ్ కు చెత్త డంపింగ్ యార్డుకు తరలకపోవటంతో అధికారులు శానిటేషన్ బుకింగ్ ఆన్ డిమాండ్ అనే సరి కొత్త ఆప్షన్ ను మై జీహెచ్ఎంసీ(GHMC) యాప్ లో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్దం చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ యాప్ ను తయారు చేసిన ఐటీ విభాగం త్వరలోనే దీని పనితీరును కమిషనర్ కు వివరించి, అన్ని సర్కిళ్లలో అమలు చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ శానిటేషన్ బుకింగ్ ఆన్ డిమాండ్ ఆప్షన్ ను బేగంపేటలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన అధికారులకు మంచి ఫలితాలు రావటంతో ఇపుడు ఈ కార్యక్రమాన్ని గ్రేటర్ పరిధిలోని అన్ని సర్కిళ్లలో అమలు చేసేందుకు సిద్దమయ్యారు.
శానిటేషన్ బుకింగ్ ఆన్ డిమాండ్ అంటే?
జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలోని మొత్తం ముప్పై సర్కిళ్ల పరిధిలో ఎక్కడో ఓ చోట తరుచూ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఈ ఫంక్షన్ వేస్ట్ ను ఇష్టారాజ్యంగా రోడ్లకిరువైపులా, జంక్షన్లలో, ఖాళీ స్థలాల్లో వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని స్థానికులు తొలగించరు, జీహెచ్ఎసీ సిబ్బంది సైతం రొటీన్ విధులు నిర్వహిస్తూ ఇలాంటి చెత్తను సకాలంలో తొలగించకపొవటంతో స్థానికంగా అపరిశుభ్రమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం అందుబాటులో ఉంచిన మై జీహెచ్ఎంసీ యాప్ లో శానిటేషన్ బుకింగ్ ఆన్ లైన్ అనే ఆప్షన్ ను పెట్టనున్నారు. వివిధ రకాల ఫంక్షన్లు చేసుకునే వారు. ఫంక్షన్ ముగిసిన తర్వాత మై జీహెచ్ఎంసీ యాప్ లోని శానిటేషన్ బుకింగ్ ఆన్ డిమాండ్ లో మెసేజ్ పెడితే, దాని ద్వారా జీహెచ్ఎంసీ స్థానిక స్వచ్ఛ ఆటో టిప్పర్ గానీ, రాంకీ వాహానాలు గానీ ఈ ఫంక్షన్ వెస్ట్ ను తరలించేలా యాప్ ను సిద్దం చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Illegal Constructions: అక్రమ నిర్మాణాలపై అధికారుల అలసత్వం
అదే బాటలో ఈ వేస్ట్ తరలింపు
జీహెచ్ఎంసీ పరిధిలోని పర్యావరణం, మానవాళికి, భూగర్భ జలాలకు ముప్పుగా మారిన ఎలక్ట్రానిక్ వేస్ట్ (ఈ-వేస్ట్)ను తరలించేందుకు కూడా జీహెచ్ఎంసీ(GHMC) అధికారులు సరి కొత్త ప్రయత్నం చేయనున్నట్లు తెలిసింది. ఈ వేస్ట్ పేరుకుపోయిన ప్రాంతాల్లో వాటితో పాటు చెత్త కూడా పేరుకుపోతున్నట్లు గుర్తించిన అధికారులు ఈ సమస్యకు చెక్ పెట్టనున్నారు. రోడ్ల పై, నాలాల్లో చెత్త వేసే వారిని గుర్తించి జరిమానాలు విధించేందుకు ఇటీవలే రూపకల్పన చేసిన సెంట్రల్ ఛలాన్ మానిటరింగ్ సిస్టమ్(CCMS) యాప్ లో స్వల్పంగా మార్పులు చేసి, ఈ-వేస్ట్ పేరుకుపోయిన చోట నుంచి తరలించేలా రూపకల్పన చేయనున్నారు. ఈ వేస్ట్ ను తరలించాలనుకునే వారు, సీసీఎంఎస్ యాప్ లో మేసేజ్ పెడితే చాలు జీహెచ్ఎంసీ ట్రాన్స్ పోర్టు వాహానాలు స్పాట్ కు చేరుకుని ఈ వేస్త్ట్ ను తరలించనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు.
డెబ్రీస్ వేస్తే వెహికల్ ఓనర్ జేబుకు చెల్లు
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) పరిధిలోని చాలా ఖాళీ ప్రాంతాల్లో రాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు భవన నిర్మాణ వ్యర్థాలు(డెబ్రీస్) వేసి వెళ్తున్నట్లు గుర్తించారు. ఈ రకంగా డెబ్రీస్ వేస్తున్న వాహానాలను గుర్తించేందుకు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవటంతో ఎవరు వేశారన్న విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు క్లారిటీ లేదు. కానీ ఇప్పటి వరకు ఈ రకమైన జరిమానాలను జనరేట్ చేసి వసూలు చేసే బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లకు మాత్రమే పరిమితం చేసిన అధికారులు ఇపుడు శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు కూడా లాగిన్ అయ్యేలా ఏర్పాట్లు చేశారు. రాత్రి పూట నైట్ డ్యూటీలు నిర్వహిస్తున్న ఈ సిబ్బంది విధించిన జరిమానాలను సక్రమంగా చెల్లించటం లేదని, డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్న జరిమానాల్లో చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు గుర్తించిన అధికారులు డెబ్రీస్ వేసిన వాహానం నెంబర్లకు సీసీఎంఎస్ లో జరిమానా జనరేట్ కాగానే నేరుగా వెహికల్ యజమానికి జరిమానా వెళ్తుంది. ఈ జరిమానాకు సంబంధించి సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శించకుండా డిజిటల్ పేమెంట్ చేసేలా ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు వెల్లడించారు.