Modi Kits : అతి త్వరలో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ‘మోదీ కిట్స్’ను అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఎన్ని వేలమంది ఉన్నా, ఎన్ని లక్ష ల మంది ఉన్నా వారందరికీ మోదీ కిట్స్ ను అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బండి సంజయ్ టెన్త్ విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి బుధవారం హాజరయ్యారు. మొత్తం 20 వేల సైకిళ్లను స్వయంగా కొనుగోలు చేసిన బండి సంజయ్ వాటిని దశలవారీగా పంపణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు.
అనంతరం బండి మాట్లాడుతూ.. ఈ సైకిళ్లు ప్రధాని మోదీ ఇస్తున్న గిఫ్ట్ అని ఆయన చెప్పారు. తానూ పేదిరికం నుంచే వచ్చానని, తిండికి సైతం ఎన్నో ఇబ్బందులు పడ్డానని విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు పేదరికంలో ఉన్నా కష్టపడి చదివిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని అయినా తలదించుకుని చదివి, తల ఎత్తుకు తిరిగేలా బతకాలని సూచించారు. తాను ఎంపీగా గెలిచానంటే అందులో 50 శాతం ఓట్లు పిల్లలు తమ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి ఒట్టు వేయించుకుని పువ్వు గుర్తుపై ఓటేసేలా చేశారని గుర్తుచేసుకున్నారు. సైకిళ్ల పంపిణీ ఆలోచన ఇచ్చిందే కలెక్టర్ అని, బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ ప్రతిపాదించారని వివరించారు. ఇవి ప్రభుత్వ నిధులు కావని, అలా అని తాను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదన్నారు.
Also Read: Soothravakyam: వివాదాస్పద నటుడు షైన్ టామ్ చాకో పోలీస్‌గా నటించిన సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే?
కొందరు కార్పొరేట్ కంపెనీల యాజమానులను సీఎస్సార్ ఫండ్ కింద ఇవ్వాలని కోరితే సానుకూలంగా స్పందించడంతో సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. తాను ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ చదివే విద్యార్థులందరికీ సైకిళ్లను అందజేస్తానని సంజయ్ఉ హామీ ఇచ్చారు. టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ.. సైకిళ్ల పంపిణీ కార్యక్రమం తమకు ఆదర్శమని పేర్కొన్నారు. తాను కూడా పేద కుటుంబం నుండి వచ్చి ఈ స్థాయికి ఎదిగానని, మాతృభాషలో చదువుకున్నా ఇబ్బంది లేదని, ఇంగ్లిష్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. విద్యార్థులకు 20 వేల సైకిళ్లను ఇవ్వడం గొప్ప విషయమని, ఈ క్రెడిట్ అంతా కేంద్ర మంత్రిదేనని కొనియాడారు. పిల్లలకు మొదటి ఆస్తి సైకిల్ అని, తనకు కూడా చిన్నప్పుడు సైకిలే తన ఆస్తి అని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్విని, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డీ శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఆర్డీవో, డీఈవోతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.