CM Revanth Reddy: తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ సిటీ ఏరియాను ప్రజల మౌలిక వసతులకు నిలువుటద్దం పట్టేలా, గ్లోబల్ సిటీకి చిరునామాగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మానవ జీవన ప్రమాణాలకు కొలమానమైన విద్య, వైద్యం, రోడ్డు రవాణా, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం అన్ని విభాగాల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. సిటీ విస్తరణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రజలు గ్రేటర్ సిటీకి లక్షలాది కుటుంబాలు వలస వస్తున్నాయని అన్నారు.
ప్రణాళిక రూపొందించాలి
సిటీ పరిధితో పాటు పెరుగుతున్న జనాభాకు అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అధునాతనంగా అందించే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణ రైజింగ్ కోర్ అర్బన్ ఏరియా అభివృద్ధిపై ప్రతిపాదనలపై చర్చించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రతిపాదనలను మరింత లోతుగా పరిశీలించాలని, ప్రజల అవసరాలు తీర్చే మౌలిక వసతులను ప్రపంచ స్థాయి అధునాతన ప్రమాణాలతో అందించేందుకు పెద్దపీట వేయాలని సీఎం అన్నారు. పైపై మెరుగులు కాకుండా పేద, మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా తెలంగాణ కోర్ అర్బన్ సిటీని అభివృద్ధి చేయాలని చెప్పారు.
Also Read: Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత
ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలుఅమలు చేయాలి
కోర్ అర్బన్ సిటీ అభివృద్ధిలో భాగంగా ప్రాథమిక విద్యను అందరికీ అందించే సంస్కరణలు ముందుగా అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కాలేజీలన్నింటినీ గుర్తించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు, 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండియర్ వరకు మూడు కేటగిరీలుగా నాణ్యమైన విద్యను అందరికీ అందించాలన్నారు. నర్సరీ నుంచి 4వ తరగతి స్కూళ్లపై ముందుగా ఫోకస్ చేయాలని, ప్రభుత్వ స్థలాలు, ఇటీవల కబ్జాలు, ఆక్రమణల నుంచి విముక్తి పొందిన ప్రభుత్వ భూముల్లో స్కూళ్లకు అధునాతన భవనాలు నిర్మించాలన్నారు.
ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య
ఇప్పుడు అరకొర వసతులతో ఉన్న నాలుగైదు స్కూళ్లను ఒకే సముదాయంలోకి తీసుకువస్తే మంచి ఫలితాలుంటాయన్నారు. టీచర్ల కొరత తీరిపోతుందన్నారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ కూడా స్కూల్లోనే అందించి, ప్రభుత్వం తరఫున ట్రాన్సోపోర్ట్ అందించాలన్నారు. దీంతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై ఫీజుల భారం తగ్గుతుందని, ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య పిల్లల భవితకు దోహదపడుతుందన్నారు. వెంటనే ఈ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేయాలని విద్యాశాఖను సీఎం ఆదేశించారు. ఇదే విధంగా పేదలందరికీ తక్షణ వైద్య సాయం అందుబాటులో ఉండేలా ప్రత్యేక క్లినిక్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వం తరఫున ప్రోత్సహకం ఉంటుంది
ప్రపంచంలో హైదరాబాద్కు క్లీన్ సిటీ ఇమేజీ తీసుకువచ్చేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. చెత్త సేకరణలో నిర్ల్యక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులను హెచ్చరించారు. చెత్త సేకరణతో పాటు క్లీన్ సిటీగా రూపొందించే ప్రణాళికలను అమలు చేసే అధికారులకు ప్రభుత్వం తరఫున ప్రోత్సహకం ఉంటుందని సీఎం ప్రకటించారు. కోర్ అర్బన్ సిటీలో ఒక్క ప్రభుత్వ ఆఫీస్ కూడా అద్దె భవనాల్లో ఉండేందుకు వీల్లేదని, ప్రతి ఆఫీస్కు సొంత భవనం ఉండాలని సీఎం అన్నారు. వాటికి అవసరమైన స్థలాలు కేటాయించాలని, ప్రాధాన్య క్రమంలో భవనాలు నిర్మించే ప్రణాళిక తయారు చేయాలన్నారు. సెక్రెటేరియట్తో పాటు సిటీలో ఉన్న ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలన్నీ పునరాత్పదక విద్యుత్తున మాత్రమే వినియోగించాలని సీఎం చెప్పారు. వెంటనే ఆఫీసులపై సోలార్ విద్యుత్తు ప్లాంట్లు అమర్చాలని ఆదేశించారు.
డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలి
కోర్ అర్బన్ సిటీలో నాలాలు, కుంటలు, చెర్వుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను కాపాడేందుకు డిజిటల్ ల్యాండ్ డేటాబేస్ విధానం అమలు చేయాలన్నారు. సిటీలో గంటల కొద్దీ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ స్టడీ జరగాలని, ట్రాఫిక్ నియంత్రణ సమర్థంగా జరిగేందుకు అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. సిటిలో ఉన్న అన్ని జంక్షన్లను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయాలని చెప్పారు. గూగుల్ సహకారంతో ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించే ప్రణాళిక వెంటనే అమలు చేయాలని సీఎం పోలీసు విభాగాన్ని ఆదేశించారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి
ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ పోలీసింగ్ విధానం అమలు చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే డ్రోన్లను కొనుగోలు చేయాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని వినియోగించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలని చెప్పారు. సిటీలో వర్షం పడితే ట్రాఫిక్ గంటల కొద్దీ ఆగిపోతుందని, జంక్షన్లలో నీళ్లు నిల్వకుండా వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ను నిర్మించాలని చెప్పారు. కోర్ అర్బన్ సిటీలో మున్సిపల్, పోలీస్, విద్యుత్తు, జలమండలి విభాగాల యూనిట్లు, వాటిని పర్యవేక్షించే అధికారుల పరిధి ఒకేతీరుగా ఉండాలని సీఎం సూచించారు.డ్రగ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని సీఎం ఆదేశించారు. డ్రగ్స్, గంజాయి సేవించి పట్టుబడితే బాధితులగా చూడవద్దని, కనీసం పది రోజుల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచాలని సీఎం అన్నారు. చెర్లపల్లి జైలు ప్రాంగణంలోనే ఈ రీహాబిలిటేషన్ సెంటర్ నిర్మించాలని అన్నారు. ఈ సెంటర్ నిర్వహణ, పర్యవేక్షణకు ఎక్స్ మిలిటరీ అధికారుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.