Shiva Re Release: తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన ‘శివ’ (Shiva Movie) చిత్రం మళ్లీ వెండితెరపై సందడి చేయబోతోంది. కింగ్ నాగార్జున (King Nagarjuna), సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కాంబినేషన్‌లో 1989లో విడుదలై, తెలుగు చిత్ర పరిశ్రమ రూపురేఖలను మార్చిన ఈ కల్ట్ క్లాసిక్‌ను, 4K డాల్బీ ఆట్మాస్ ఫార్మాట్‌లో నవంబర్ 14న రీ-రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కానీ, టెక్నాలజీ, కథల తీరు పూర్తిగా మారిపోయిన ఈ తరుణంలో, ఇప్పుడున్న ‘జెన్-జీ’ (Gen-Z) ప్రేక్షకులను ‘శివ’ ఏ విధంగా మెప్పిస్తుందనేదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య కొన్ని సినిమాలు రీ రిలీజ్‌లోనూ రికార్డులు క్రియేట్ చేశాయి. ఆ లిస్ట్‌లోకి ఈ సినిమా కూడా చేరుతుందని అంతా అనుకుంటున్నారు. మరి అసలు ఇందులో ఉన్న విషయమేంటో తెలుసుకుందామా..
‘శివ’ ఎందుకు కల్ట్ క్లాసిక్?
‘శివ’ కేవలం ఒక సినిమా కాదు, అది తెలుగు సినిమాకు ఒక కొత్త ఒరవడిని పరిచయం చేసింది. అంతకుముందు ఉన్న రొటీన్ ఫార్ములాను బద్దలు కొట్టి, వాస్తవికమైన యాక్షన్, అప్పటి యువత ఆలోచనలను తెరపై చూపించింది. కొత్త కెమెరా యాంగిల్స్, నేపథ్య సంగీతంలో వినూత్నత, హింసను చూపించిన తీరు.. అన్నీ అప్పటి ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చాయి. ఈ మార్పు కారణంగానే ‘శివ’ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేసిందని ఇప్పటికీ దిగ్గజాలు చెబుతున్నారు.
జెన్-జీకి కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉందా?
ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడున్న జెన్-జీ (1997 నుంచి 2012 మధ్య జన్మించిన తరం) ఈ సినిమాను చూడటానికి ఎందుకు ఆసక్తి చూపాలి? అనే విషయానికి వస్తే.. ‘శివ’ సినిమా కథ, హీరో పాత్ర చిత్రీకరణ ఇప్పటి యువతరం మైండ్‌సెట్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. నాగార్జున పాత్ర మొదట్లో చాలా సింపుల్‌గా, సాధారణ విద్యార్థిగా ఉండి, అన్యాయాన్ని ఎదిరించడానికి, తన చుట్టూ ఉన్న వ్యవస్థను మార్చడానికి ఆయన మారే విధానం… ఇప్పుడు ప్రతి యువకుడు ‘నేనే హీరో’ అనుకునే, తమ చుట్టూ ఉన్న సమస్యలపై స్పందించాలనుకునే యువత ఆకాంక్షలకు ప్రతిబింబంగా కనిపిస్తుంది. ‘శివ’లో నాయకత్వం అనేది రాజకీయాలకు, డబ్బుకు అతీతంగా ఉంటుంది. కేవలం ధైర్యం, న్యాయం పట్ల నిబద్ధతతో ఒక సాధారణ వ్యక్తి కాలేజీ రాజకీయాలను, గ్యాంగ్‌స్టర్ల వ్యవస్థను ఎలా ధైర్యంగా ఎదుర్కొన్నాడనేది ఈ తరానికి ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే అంశం.
Also Read- Mana Shankara Vara Prasad Garu: వైరల్ సెన్సేషన్.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!
ట్రెండ్ సెట్టింగ్
టెక్నాలజీతో పాటు సినిమా మేకింగ్‌లోనూ వినూత్నతను కోరుకునే ఈ తరానికి, సౌండ్ టెక్నాలజీ, యాక్షన్ కొరియోగ్రఫీ విషయంలో ‘శివ’ ఆ కాలంలో ఎంత ట్రెండ్‌సెట్టర్‌గా ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ముఖ్యంగా, ‘శివ’ సైకిల్ చైన్ వాడిన విధానం, గ్యాంగ్‌స్టర్ డ్రామాలోని వాస్తవికత.. వంటివి ఆసక్తిని కలిగిస్తాయి. అందుకే, 4K డాల్బీ ఆట్మాస్ వంటి మెరుగైన సాంకేతికతతో వస్తున్న ఈ రీ-రిలీజ్, జెన్-జీని కచ్చితంగా మెప్పించే కంటెంట్‌ను కలిగి ఉంది. నాటి సెన్సేషన్‌ను, నాగార్జున యొక్క కొత్త స్టైల్‌ను, రామ్ గోపాల్ వర్మ యొక్క వినూత్న ఆలోచనలను నేటి ప్రేక్షకులు ఆదరిస్తే, బాక్సాఫీస్ వద్ద ‘శివ’ మరోసారి సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
