Currency Scam: ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టి మరీ నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ప్రధాన సూత్రధారులతో సహా మొత్తం 8 మంది సభ్యులు ఉన్న నెట్‌వర్క్‌ను సౌత్‌వెస్ట్ జోన్టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.4.75 లక్షల విలువ చేసే నకిలీ రూ.500 నోట్లు, కారు, మూడు ద్విచక్ర వాహనాలు, 9 సెల్ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జోన్ డీసీపీ చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం, తాండూరుకు చెందిన కస్తూరి రమేశ్‌బాబు (35) వృత్తిరీత్యా కారు మెకానిక్. ఇతను తన సోదరి రామేశ్వరితో కలిసి నివాసం ఉంటున్నాడు. తేలికగా డబ్బు సంపాదించాలనే దురాశతో రమేశ్చాలా కాలంగా నకిలీ కరెన్సీ దందా చేస్తున్నాడు.
ఇంట్లోనే నకిలీ కరెన్సీ..
గతంలో గుజరాత్‌లోని రాజ్‌కోట్, హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట, గోపాలపురం పోలీసులకు ఇతను పట్టుబడ్డా కూడా తన అక్రమ దందాను మాత్రం ఆపలేదు. రమేశ్ తన సోదరితో కలిసి ఇంట్లోనే నకిలీ కరెన్సీని తయారుచేస్తున్నాడు. ముందుగా అసలైన రూ.500 నోటును స్కాన్ చేసి, దాన్ని ఫోటో షాప్‌లో ఎడిట్ చేస్తాడు. ఆ తర్వాత జే.కే. బాండ్ పేపర్‌పై ప్రింట్లు తీసుకుంటాడు. అనంతరం, ఆకుపచ్చ రంగు గిఫ్ట్‌ప్యాక్ పేపర్‌ను కత్తిరించి, నిజమైన నోట్లపై ఉండే గ్రీన్ కలర్ సెక్యూరిటీ థ్రెడ్‌లా అతికిస్తాడు. హీట్ గన్‌తో ఆరబెట్టిన తర్వాత, తయారుచేసిన నకిలీ నోట్లను కట్టలుగా కడతాడు.
Also Read: Happy Childrens Day: మీ పిల్లలకు ఇలా ప్రేమగా విషెస్ చెప్పండి!
నెట్ వర్క్ ఇలా..
ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఉన్న రమేశ్ అసలు రూ.500 నోటుకు నాలుగు నకిలీ నోట్లు కావాలనుకునేవారు తనను సంప్రదించాలంటూ కామెంట్ బాక్స్‌లో ఫోన్ నెంబర్‌తో సహా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూసిన సులేమాన్ నగర్‌కు చెందిన అబ్దుల్ వహీద్ (21), మహ్మద్ అబ్దుల్ ఖాదర్ (21)లు రమేశ్ బాబును సంప్రదించి, 1:4 పద్దతిలో నకిలీ కరెన్సీ తీసుకున్నారు. అనంతరం వీరు 1:3 పద్దతిలో సులేమాన్‌నగర్‌కు చెందిన సొహైల్ (21), బహదూర్‌పురా వాస్తవ్యుడు ఫహాద్ (23)కు ఈ నోట్లను అమ్మివేశారు. ఈ ఇద్దరూ 1:2 పద్దతిలో కిషన్‌బాగ్ నివాసి షేక్ ఇమ్రాన్ (23), ఉప్పుగూడ వాస్తవ్యుడు ఒమర్ ఖాన్ (23)కు ఇచ్చారు. చివరగా, ఇమ్రాన్, ఒమర్ ఖాన్ కలిసి కిషన్‌బాగ్ నివాసి, బీకాం కంప్యూటర్స్ ఫైనలియర్విద్యార్థి సయ్యద్ అల్తమష్ అహమద్‌తో కలిసి ఈ నకిలీ నోట్లను ఫస్ట్ లాన్సర్ ఈద్గా గ్రౌండ్ వద్ద మార్చడానికి ప్రయత్నిస్తుండగా, పక్కా సమాచారాన్ని సేకరించిన ఇన్‌స్పెక్టర్లు మల్లేశ్, సంతోష్ కుమార్, రాంబాబు, ఎస్ఐ ప్రీతిరెడ్డితోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈ ముగ్గురు వెల్లడించిన వివరాల ఆధారంగా మిగతా నిందితులను కూడా అరెస్ట్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసిన మెహదీపట్నం పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచి జైలుకు రిమాండ్ చేశారు.
Also Read: Jubilee Hills Counting: జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు
