Visakhapatnam: విశాఖలో భూమి ఒక్కసారిగా కంపించింది. మంగళవారం తెల్లవారుజామున 4.20 గం.ల ప్రాంతంలో భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో గాఢ నిద్రలో ఉన్న నగరవాసులు.. ఒక్కసారిగా నిద్రలేచారు. ఏం జరుగుతుంతో అర్థం గాక.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల తీవ్రత.. రిక్టర్ స్కేలుపై 3.7 గా నమోదైంది.
ఆ ఏరియాల్లో ప్రకంపనలు..
భూకంప కేంద్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి. మడుగుల గ్రామం సమీపంలో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అక్కడి నుంచి తీరం వెంబడి విశాఖపట్నం వరకూ భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే విశాఖలోని మురళీనగర్ (Murali Nagar), గాజువాక (Gajuwaka), మధురవాడ (Madhurawada), ఎంవీపీ కాలనీ (M.V.P. Colony) ప్రజలు.. భూమి కంపిచడాన్ని గుర్తించారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అయితే విశాఖలో భూకంపం గురించి సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది. నిజంగానే భూకంపం వచ్చిందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తుండగా.. అవునని వైజాగ్ వాసులు సమాధానం ఇస్తున్నారు.
విశాఖపై భూకంప ప్రభావం తక్కువే
అయితే విశాఖలో భూకంపం రావడం చాలా అరుదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. గత దశాబ్ద కాలంలో విశాఖలో 4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతలో ఐదు భూకంపాలు మాత్రమే నమోదయ్యాయి. విశాఖ సిస్మిక్ జోన్ 2 (Seismic Zone II)లో ఉంది. ఈ జోన్ లో ఉన్న ప్రాంతాలను భూకంప ప్రమాద తీవ్రత తక్కువగా ప్రదేశాలుగా నిపుణులు పేర్కొన్నారు. నిపుణుల ప్రకారం విశాఖ స్థిరమైన భూకంప మండలంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న భూ కదలికలు తప్ప పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే విపత్తు రావడం కష్టమేనని తెలియజేశారు.
Also Read: Coimbatore Crime: ప్రియుడితో షికారుకొచ్చిన విద్యార్థిని.. ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మృగాళ్లు.. పోలీసులు ఏం చేశారంటే?
చివరి భూకంపం ఎప్పుడంటే?
ఇదిలా ఉంటే విశాఖలో చివరిగా 2024 డిసెంబర్ 17న భూ ప్రకంపనలు సంభవించాయి. విశాఖకు ఉత్తరంగా 208 కి.మీ దూరంలో 2.9 తీవ్రతతో భూకంపం నమోదైంది. అంతకుముందు 2021 నవంబర్ 14న నగర తూర్పు తీరంలో 1.8 తీవ్రతతో భూకంపం చోటుచేసుకుంది. ఆ సమయంలోనూ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు.
