Road Accidents Report: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2023 ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సమగ్ర నివేదిక వెలువడింది. ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2023’ (Road Accidents in India 2023) పేరుతో కేంద్ర రవాణా, జాతీయ మంత్రిత్వశాఖ (Union ministry of road transport and highways) రిపోర్టును విడుదల చేసింది. దీని ప్రకారం 2022 ఏడాదితో పోలిస్తే.. 2023లో ఏపీలో రోడ్డు ప్రమాదాలు కొద్దిమేర తగ్గాయి. అయినప్పటికీ సగటున 100 ప్రమాదాలకు గాను 4.74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక పేర్కొంది.
నివేదికలో ఏముందంటే?
ఆంధ్రప్రదేశ్ లో 2023 ఏడాదిలో మెుత్తం 19,949 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నట్లు ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2023’ నివేదిక స్పష్టం చేసింది. ఈ ప్రమాదాల్లో 8,130 మంది మృతి చెందగా.. 20,409 మంది గాయపడ్డారని పేర్కొంది. అయితే 2022లో నమోదైన రోడ్డు ప్రమాదాలతో (21,249) పోలిస్తే.. 2023లో ప్రమాదాలు కాస్త తగ్గుముఖం పట్టాయని నివేదిక స్పష్టం చేసింది. 2023లో ఓవరాల్ గా సంభవించిన అతి ప్రాణాంతక 7,516 ప్రమాదాల్లో 5,410 గ్రామాల్లోనే నమోదయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో 2,106 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
రహదారుల వారీగా..
ఏపీలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదాలను జాతీయ, రాష్ట్ర రాహదారుల వారీగా నివేదిక విభజించింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. జాతీయ రహదారులపై 8,276 ప్రమాదాలు జరగ్గా.. 3,806 మంది చనిపోయారు. 8,507 గాయపడ్డారు. రాష్ట్ర రహదారులకు వచ్చేసరికి 6,174 ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 2,259 మంది మరణించగా.. 7,243 గాయపడ్డారు. ఇతర రోడ్లపై 5,499 ప్రమాదాలు నమోదు కాగా.. 2,072 మరణాలు సంభవించాయి. మరో 4,659 మందికి గాయాలయ్యాయి. మెుత్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే 72శాతం మరణాలు చోటుచేసుకున్నట్లు నివేదిక స్పష్టం చేసింది.
వాహనాల వారీగా చూస్తే..
2023లో సంభవించిన ప్రమాదాలను వాహనాల వారీగా చూస్తే బాధితుల్లో ద్విచక్రవాహనదారులే అత్యధికంగా ఉన్నారు. 29.1 శాతం మరణాలు బైక్ రైడర్లదే కావడం గమనార్హం. పాదచారుల్లో 16.9%, సైకిల్ ప్రయాణికులు 10.3%, కారు ప్రయాణికులు 12.4%, మూడు చక్రాల వాహనదారులు 8.7%, ట్రక్ లేదా ట్రాక్టర్ ప్రయాణికులు 9.8%, బస్సు ప్రయాణికులు 4.6%, ఇతరులు 8.2% మేర బాధితులుగా ఉన్నట్లు నివేదిక తెలిపింది.
ప్రమాదాల్లో విజయవాడ టాప్..
నగరాల వారీగా చూస్తే 2023లో విజయవాడలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. మెుత్తం 1,522 ప్రమాదాలు జరగ్గా 373 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,416 మంది గాయపడ్డారు. విశాఖలో 1,293 ప్రమాదాలు చోటుచేసుకోగా 322 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,222 మంది గాయాలతో బయటపడ్డారు. 2021తో పోలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాల తీవ్రత 38.0 నుండి 2023లో 40.8కి పెరిగిందని నివేదిక తెలియజేసింది. 2020లో 6,531 ప్రాణాంతక ప్రమాదాలు ఉండగా 2021లో 7,585, 2022లో 7,688, 2023లో 7,516 నమోదయ్యాయి. మరణాల సంఖ్య 2020లో 7,039 ఉండగా.. 2022లో 8,293కి పెరిగి 2023లో స్వల్పంగా 8,137కి తగ్గింది.
Also Read: Bigg Boss Telugu: మిస్టరీ ఫోన్ కాల్.. కన్ఫ్యూజన్‌లో హౌస్‌మేట్స్.. బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశారుగా!
హెల్మెట్ నిబంధన ఉల్లంఘన
ఏపీలో పెద్ద ఎత్తున హెల్మెట్ నిబంధన ఉల్లంఘనకు గురవుతున్నట్లు రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా – 2023 రిపోర్ట్ తెలియజేసింది. పట్టణాల్లో 74% టూ-వీలర్ రైడర్లు హెల్మెట్ ధరించడం లేదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో 78% మంది బైకర్స్.. హెల్మెట్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని స్పష్టం చేసింది. వెనుక కూర్చునేవారు హెల్మెట్ ధరించే విషయమై ఉల్లంఘనలు 98 శాతంగా ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది. గ్రామాల్లో ఇది 99 శాతంగా నమోదైనట్లు చెప్పింది.

