Secunderabad Issue: సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. సికింద్రాబాద్ ను చరిత్రలో లేకుండా చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం నేడు (శనివారం) బీఆర్ఎస్ పోరు బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సికింద్రాబాద్, హైదరాబాద్.. నగరానికి రెండు కళ్లు అని అన్నారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆయన.. అప్పుడు సికింద్రాబాద్ ను జిల్లా చేసే ఆలోచన చేస్తామని ప్రకటించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్..
ఒకప్పుడు తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నామని.. ఇప్పుడు రేవంత్ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నామని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కంటే ప్రజలకు ఎక్కువ మేలు చేస్తామంటూ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారన్నారు.. ఆరు గ్యారంటీలు, 420 హామీలను నూరు రోజుల్లోనే నెరవేరుస్తామని అడ్డగోలు మాటలు చెప్పారని పేర్కొన్నారు. ‘అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అటకెక్కించారు. 420 హామీలు ఏమూలకు పోయాయో తెలియదు. కానీ వాళ్లు చేస్తున్న పని ఏంది. మెుట్టమెుదటి పని TSని TG అన్నారు. దాని వల్ల ఏ పేదవాడికి లాభం కలిగిందో ఇప్పటివరకూ తెలియదు. తెలంగాణ తల్లిని తీసేసి, కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారు. తెలంగాణ అస్థిత్వాన్నే దెబ్బకొట్టే విధంగా ఆ తల్లి రూపునే మార్చేశారు. ఇలా అపసవ్య పనులు, తుగ్లక్ చర్యలు తప్పా రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమి లేదు’ అని కేటీఆర్ మండిపడ్డారు.
సికింద్రాబాద్ ఐడెంటిటీ మిస్సింగ్!
గత బీఆర్ఎస్ పాలనలో అధికార వికేంద్రీకరణకు కేసీఆర్ పెద్దపీట వేశారని కేటీఆర్ గుర్తుచేశారు. అభివృద్ధిని విస్తరించేందుకు 10 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలు చేసుకున్నట్లు చెప్పారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసి ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు గుర్తుచేశారు. గతంలో గ్రేటర్ హైదరాబాద్ లో 24 సర్కిళ్లు ఉంటే.. 30కి పెంచుకున్నామని అన్నారు. గతంలో 4 జోన్లు ఉంటే, 6 జోన్లు చేసుకున్నామని చెప్పారు. ప్రతీ జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ అధికారాలను విస్తరించామన్నారు. ఇన్ని చేసినా హైదరాబాద్ అస్థిత్వాన్ని మాత్రం తాము ముట్టుకోలేదని కేటీఆర్ అన్నారు. దానిని దెబ్బతీసే ప్రయత్నం బీఆర్ఎస్ ఎన్నడూ చేయలేదని స్పష్టం చేశారు. అలాంటిది నేడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కారణంగా సికింద్రాబాద్ కు ఒక ఐడెంటిటీ లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
Also Read: Municipal Elections: వార్డుల రిజర్వేషన్లపై కలెక్టర్ల కసరత్తు.. నేడో, రేపో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ!
సికింద్రాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ అండ!
సికింద్రాబాద్ ఐడెంటిటీని దెబ్బతీయడాన్ని తట్టుకోలేక అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై శనివారం ర్యాలీకి సిద్దమయ్యారని కేటీఆర్ అన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించారని చెప్పారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్ లోని మహాత్మాగాంధీ విగ్రహం వరకూ తలపెట్టిన భారీ శాంతి ర్యాలీని.. అనుమతి లేదన్న పేరుతో పోలీసులు అడ్డుకోవడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. రిపబ్లిక్ డేకు 10 రోజుల ముందల తెలంగాణలో పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్న వారిని ఎక్కడికక్కడ నిర్భందించారని మండిపడ్డారు. సికింద్రాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న కేటీఆర్.. కోర్టు అనుమతి తెచ్చుకొని మరి శాంతి ర్యాలీ మళ్లీ నిర్వహిస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సికింద్రాబాద్ ను జిల్లా చేసే ఆలోచన చేస్తామంటూ హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బ తీస్తోంది: కేటీఆర్
సికింద్రాబాద్‌ను చరిత్రలో లేకుండా చేయాలని చూస్తున్నారు
జంట నగరాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది
హైదరాబాద్, సికింద్రాబాద్‌కు ఎంతో చరిత్ర ఉంది
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ pic.twitter.com/LvJQDx241d
— BIG TV Breaking News (@bigtvtelugu) January 17, 2026

