Municipal Reservations: యావత్ తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న మునిసిపల్ ఎన్నికల (Telangana Municipal Elections) రిజర్వేషన్లు ఖరారయ్యాయి. శనివార రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్ల వివరాలను (Municipal Reservations) ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు ఉండగా, అత్యధికంగా బీసీలకు 38 ఖరారయ్యాయి. ఇక ఎస్సీలకు-17, ఎస్టీలకు-5లకు కార్పొరేషన్ మేయర్లు, లేదా చైర్‌పర్సన్లు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మిగతా 61 స్థానాలకు జరనల్‌కు కేటాయించినట్టు అయ్యింది.
బీసీలకు 31.4 శాతం.. బీసీ రాజకీయ రగులుతుందా?
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అయితే, న్యాయస్థానాల్లో చిక్కులు ఎదురయ్యాయి. దాంతో, 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇక, పురపోరుకు తెరలేవడంతో రిజర్వేషన్ల ఖరారు కోసం ఆశావహులు ఎదురుచూశారు. ముఖ్యంగా బీసీ వర్గాలు చాలా ఆశగా ఎదురుచూసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో బీసీలకు 31.4 శాతం రిజర్వేషన్లు కేటాయించడాన్ని రాజకీయంగా ఎలా చూడాలి?. కాంగ్రెస్‌కు ఏమైనా మైలేజీ ఇస్తుందా?, నెగిటివ్‌గా మారుతుందా?, బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుంది?. రిజర్వేషన్ల ఖరారు నేపథ్యంలో బీసీ రాజకీయం మళ్లేమైనా రగులుతుందా?.. అనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also- Jhansi Incident: ప్రియుడితో భార్య.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త.. వీడియో వైరల్!
కాంగ్రెస్‌కు మైలేజీనా.. మైనస్సా?
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల ఖరారు కావడం బీసీ రాజకీయాలు మళ్లీ ఊపందుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అత్యధికంగా 38 స్థానాలను బీసీలకు కేటాయించామని, గత ప్రభుత్వాల కంటే మెరుగ్గా ప్రాధాన్యత ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చెప్పుకునే అవకాశం మెండుగా కనిపిస్తోంది. బీసీల పార్టీ అనే ముద్ర వేయించుకునేందుకు దీనిని ఒక అవకాశంగా మలుచుకునే సూచనలు ఉన్నాయి. అయితే, 42 శాతం రిజర్వేషన్ల హామీ నెరవేర్చలేదని విపక్షాలు విమర్శించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పుర పోరలో ప్రచారాస్త్రంగా వినియోగించుకునే ఛాన్స్ ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బీసీ కార్డ్ పాలిటిక్స్ పక్కా!
పంచాయతీ ఎన్నికల్లో విపక్షాలు తాము ఆశపడ్డ స్థాయిలో రాణించలేకపోయారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సత్తా చాటడడంతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై సదాభిప్రాయం ఉందనే స్పష్టమైన సంకేతాలు వెలువడినట్టు అయ్యింది. దీంతో, మునిసిపల్ ఎన్నికల్లోనైనా సత్తా చాటి క్షేత్ర స్థాయి కేడర్‌లో ధైర్యాన్ని నింపాలని ఇటు బీఆర్ఎస్, బీజేపీ ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బీసీ ఓటు బ్యాంక్‌పై ప్రభావితం చేసేలా పాలిటిక్స్ నడపడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదంటూ ప్రచారానికి పూనుకునే అవకాశం ఉంది. మొత్తంగా, బీసీ రాజకీయం మరోసారి రగలడం ఖాయంగా కనిపిస్తోంది. మరి, ఈ 31.4 శాతాన్ని ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది. ఏవిధంగా వ్యూహాలు పన్నుతుంది?, ప్రతిపక్షాలు ఎలాంటి అస్త్రాలు సంధిస్తాయనేది త్వరలోనే జరగనున్న ‘పురపోరు’లోనే తేలిపోనుంది. బీసీ ఓటు బ్యాంకు ఏ పార్టీకి ప్లస్ అవుతుందో.. ఏ పక్షానికి మైనస్ అవుతుందనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తేటతెల్లం చేయనున్నాయి.

