Municipal Elections: మున్సిపాలిటీల పదవీకాలం పూర్తై ఏడాది కావస్తున్నది. గతేడాది కాలంగా ప్రత్యేక అధికారుల పాలనతో ఇన్ని రోజులుగా పరిపాలన సాగింది. సర్పంచ్, మున్సిపాలిటీల పదవీకాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కాలయాపన చేసింది. స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేర్పులు చేసేందుకు కాలయాపన చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తపన పడినప్పటికీ కొన్ని కారణాలతో జాప్యం జరిగింది. దీంతో మరింత కాలయాపన చేయడంతో పరిపాలన కుంటు పడుతుందని ఎన్నికలు నిర్వహించేందుకు నడుం బిగించింది. 2025 నవంబర్, డిసెంబర్ నెలలో మూడు దఫాల్లో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేశారు. నేడో, రేపో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వేయనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్లు మున్సిపాలిటీల వారీగా ఓటర్ జాబితాను సిద్దం చేసింది. రాష్ట్రాన్ని యూనిట్‌గా చేసుకొని మున్సిపాలిటీల వార్డులు, ఛైర్ పర్సన్‌ల రిజర్వేషన్ల సంఖ్యను కేటాయించింది. వీటి ఆధారంగా ఆయా మున్సిపాలిటీల్లో ఏ వార్డు, ఏ మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ రిజర్వేషన్లను నేడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీయనున్నట్లు సమాచారం.
డ్రా పద్దతిలో వార్డుల రిజర్వేషన్
రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అయితే, ఆ మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా రిజర్వేషన్ ప్రక్రియను డ్రా పద్దతిలో చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్లు కసరత్తు చేస్తున్నారు. వివిధ పార్టీల ప్రతినిధులు సమక్షంలోనే వార్డుల రిజర్వేషన్ ఖరారు కానున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికారులు వార్డుల విభజన ప్రక్రియను సైతం ప్రకటించారు. వార్డుల విభజన జమ్లీంగ్ విధానంతో వచ్చిన రిజర్వేషన్లు పునరావృత్తం కాకుండా పకడ్బందీగా అధికారులు ప్రక్రియను పూర్తి చేశారు. అంతేకాకుండా పోలింగ్ స్టేషన్లకూడా 20 చదరపు మీటర్ల పరిధిలో ఉండేలా ఎంపిక చేశారు. ఇప్పటికే ఆశావహులు వార్డుల్లో రిజర్వేషన్లు తమకు అనుకూలంగా ఉన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉంటే బరిలో ఉంటానని సన్నిహితులకు, బంధువులతో చర్చించుకుంటున్నారు. నేటితో రిజర్వేషన్లపై నున్న ఆందోళనకు చెక్ పడనున్నట్లు సమాచారం.
జనరల్ మహిళా స్థానాలే అధికం
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల వారీగా కేటాయించిన రిజర్వేషన్‌లో జనరల్ మహిళలకే అత్యధిక వార్డు స్ధానాలు దక్కనున్నట్లు తెలుస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 7 మున్సిపాలిటీల్లో 138 వార్డులు ఉన్నాయి. ఇందులో 10 వార్డులు ఎస్టీలకు కేటాయిస్తే ఇద్దరి మహిళలు ఉన్నారు. ఎస్సీలకు 25 స్థానాల్లో 14 జనరల్, 11 మహిళలకు.. బీసీలకు 33 స్థానాల్లో 20 జనరల్, 13 మహిళలకు.. జనరల్ మహిళలకు 42 స్థానాలు.. రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా 28 మంది పోటీ చేసేందుకు అవకాశం ఉంది. ఇదే విధంగా మేడ్చల్ జిల్లాలో 68 వార్డులుంటే ఎస్టీలకు 7 స్థానాలు, 5 స్థానాలు జనరల్, రెండు స్థానాలు మహిళలు.. ఎస్సీలకు 12 స్థానాలు, 7 స్థానాలు జనరల్, 5 స్థానాలు మహిళలు.. బీసీలకు 15 స్థానాలు 8 జనరల్, 7 స్థానాలు మహిళలకు.. జనరల్ మహిళలు 20 స్థానాలకు.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 14 స్థానాలు కేటాయించారు.
మహిళలకు అత్యధికం
వికారాబాద్ జిల్లాలో 100 వార్డులు ఉన్నాయి. ఇందులో ఎస్టీలకు 5 స్థానాలు నాలుగు జనరల్, ఒకటి మహిళలకు, ఎస్సీలకు 13 స్థానాలు 7 స్థానాలు జనరల్, 6 మహిళలకు.. బీసీలకు 32 స్థానాలు 17 స్థానాలు జనరల్,15 మహిళలకు.. జనరల్ మహిళలకు 28.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా 22 స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది. ఈ రిజర్వేషన్లు పూర్తిగా పరిశీలిస్తే జనరల్ మహిళలకు అత్యధికంగా కేటాయించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్‌లో సగం శాతం మహిళలకు పూర్తి స్థాయిలో భర్తీ చేసినట్లు తెలుస్తోంది. కానీ, మున్సిపాలిటీల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అందాల్సిన రిజర్వేషన్లు అందలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే, వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ నేడు కలెక్టరేట్ కార్యాలయాల్లో ఖరారు కానున్నట్లు స్పష్టమైంది.
Also Read: Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

