Koluvula Panduga: హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కొలువుల పండుగ’లో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న క్రమంలో ‘చంద్రబాబు నాయుడు’ (Chandrababu Naidu) అనే అభ్యర్థి పేరు పిలవగానే సభలో నవ్వులు, కేరింతలు మిన్నంటాయి. ఏపీ సీఎం పేరుతో ఉన్న ఆ అభ్యర్థికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నవ్వుతూ అభినందనలు తెలిపి పత్రాన్ని అందజేశారు. మంత్రులు కూడా ఈ సందర్భాన్ని ఎంజాయ్ చేయగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
గ్రూప్ – 3 పరీక్షల్లో ఉత్రీర్ణులైన 1,370 మంది అభ్యర్థులకు శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. అభ్యర్థులకు స్వయంగా నియామక పత్రాలు అందించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఇలా వరుసగా అభ్యర్థుల పేర్లను పిలుస్తూ వేదిక మీదకు అహ్వానిస్తున్న క్రమంలోనే ‘A. చంద్రబాబు నాయుడు’ పేరుతో ఉన్న అభ్యర్థి సైతం వేదికపైకి వచ్చారు. దీంతో వేదికపై ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ రావు, అజారుద్దీన్, ఇతర ప్రముఖులు ఒక్కసారిగా ఆనందానికి లోనయ్యారు. చంద్రబాబు అనే అభ్యర్థి భుజం తట్టి.. అభినందించారు. దీంతో ఒక్కసారిగా సభలో కేరింతలు వినిపించాయి.
TG: హైదరాబాద్‌లో నిర్వహించిన 'కొలువుల పండుగ'లో ఒక సరదా సన్నివేశం చోటుచేసుకుంది. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తున్న క్రమంలో, 'చంద్రబాబు నాయుడు' అనే అభ్యర్థి పేరు పిలవగానే సభలో నవ్వులు, కేరింతలు మిన్నంటాయి. ఏపీ సీఎం పేరుతో ఉన్న ఆ అభ్యర్థికి సీఎం రేవంత్‌రెడ్డి నవ్వుతూ అభినందనలు… pic.twitter.com/asMnqBXsIw
— ChotaNews App (@ChotaNewsApp) January 17, 2026
ఉద్యోగులకు కీలక సూచనలు..
నియామక పత్రాల అందజేత అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ – 3 ఉద్యోగులకు కీలక సూచనలు చేశారు. కొత్తగా చేరినవారంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణను నిలపడానికి మీరంతా కష్టపడాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం కోసం తలెత్తుకొని పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఉద్యోగం ఒక భావోద్వేగమన్న సీఎం రేవంత్.. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుందన్నారు. తద్వారా తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలమని చెప్పారు.
Also Read: GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకే కార్పొరేషన్ కింద నిర్వహిస్తారా? లేక మూడు ముక్కలు చేసి జరుపుతారా?
నేడు ఆ జిల్లాలో సీఎం పర్యటన
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ రూ.1284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లిలో రూ.200 కోట్లతో నిర్మించతలపెట్టిన IIITకి భూమి పూజ చేసి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఎం.వి.ఎస్ డిగ్రీ, పి.జి కళాశాలలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు. అలాగే ఎం. వి.ఎస్.డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి గదులు, త్రాగు నీటి శుద్ధి కేంద్రం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, నర్సింగ్ కళాశాల భవనంకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం మాట్లాడనున్నారు.

