GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకే కార్పొరేషన్ కింద నిర్వహిస్తారా, లేక మూడు ముక్కలు చేసి జరుపుతారా అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. త్వరలో 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ జారీ కానున్నది. వీటితోపాటు (GHMC) జీహెచ్ఎంసీలో విభజించిన 300 మున్సిపల్ వార్డులకు సర్కారు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఈ నెల 14న ప్రకటన జారీ చేసింది. దీంతో సర్కారు జీహెచ్ఎంసీ ఎన్నికల వైపు దిష్టి సారించిందని అర్థం అవుతున్నది.
జీహెచ్ఎంసీ రిజర్వేషన్లు ఇలా
జీహెచ్ఎంసీలో ఇటీవల పునర్విభజించిన 300 మున్సిపల్ వార్డులలో ఎస్సీలకు 23, ఎస్టీలకు 5, బీసీలకు 122, జనరల్‌కు 150 కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్టీలకు 5, ఎస్సీలకు 23, బీసీలకు 122, అన్ రిజర్వుడ్ మహిళలకు 76, అన్ రిజర్వుడ్ జనరల్ 74 సీట్లు కేటాయించారు. ఎస్టీలకు కేటాయించిన 5 స్థానాల్లో 3 పురుషులకు, 2 స్త్రీలకు ఇచ్చారు. ఎస్సీలలో పురుషులకు 12, మహిళలకు 11, బీసీల్లో చెరి 61 చొప్పున కేటాయించారు. పాత జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేసి, కొత్త పరిధులు విస్తరించారు. విస్తరిత జీహెచ్ఎంసీలో మొత్తం 12 జోన్లు, 60 సర్కిళ్లు 300 డివిజన్లు ఉన్నాయి.
అనేక అనుమానాలు
పాలకమండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉండడంతో, ఆ తర్వాతే ఎన్నికలు జరిగే ఆవకాశం ఉన్నది. అయితే, జీహెచ్ఎంసీని సర్కార్ 3 కార్పొరేషన్లుగా విభజించి మరోసారి రిజర్వేషన్ ఖరారు చేస్తుందా, అందుకు అవసరమైన బీసీ జనగణన నిర్వహించి మరోసారి ఖరారు చేసే అవకాశం ఉన్నదా అనే డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. ఫిబ్రవరి 10న పాలకమండలి అధికార గడువు ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు వాదనలున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన పరిధిని మూడు మున్సిపల్ కార్పొరేషన్లు చేస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అలాగే జరిగితే మున్సిపల్ కమిషనర్ల ప్రతిపాదనల ప్రకారం రిజర్వేషన్లపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
నేడు వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు?
రాష్ట్రంలో మున్సిపాలిటీలు కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేసిన సర్కారు జీహెచ్ఎంసీలోని మొత్తం 300 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఈ నెల 14న ప్రకటన చేసింది. వివిధ సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల సీట్ల అంకెను ప్రకటించిన సర్కారు ఇవాళ వార్డుల వారీగా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నదని సమాచారం.
Also Read: GHMC: జీహెచ్ఎంసీ పరిధిలో రూ.7038 కోట్లతో ఫ్లై ఓవర్లు.. కేబీఆర్ పార్కు చుట్టు పనులకు మోక్షం ఎపుడూ?

