G Ram G Bill: దేశంలోని గ్రామీణ నిరుపేదలకు దాదాపుగా రెండు దశాబ్దాలపాటు ఉపాధి కల్పించిన ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ఏ స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చే ప్రక్రియలో తొలి అడుగు వేసింది. విపక్షాల అభ్యంతరాలను పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వ (Central Govt) తన పంతాన్ని నెగ్గించుకుంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానంలో (MGNREGA) రూపొందించిన జీ రామ్ జీ బిల్లుకు (G Ram G Bill) గురువారం నాడు లోక్‌సభలో (Lok Sabha) ఆమోదం పొందింది. కాంగ్రెస్ (Congress) సహా విపక్ష పార్టీల సభ్యులు తీవ్ర నిరసనలు, అభ్యంతరాల మధ్య పాసయ్యింది. ఈ బిల్లును స్టాడింగ్ కమిటీ పరిశీలనకు పంపించాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్లు చేశారు. బిల్లు ప్రతులను సభలోనే చించివేశారు. అయినప్పటికీ, తీవ్ర గందరగోళం మధ్య బిల్లుపై లోక్‌సభ ఆమోదముద్ర పడింది. ఇక, ఈ బిల్లును రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
విపక్షాల తీవ్ర అభ్యంతరాలు
జీ రామ్ జీ బిల్లుపై ఓటింగ్‌కు ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరుని తొలగించడమంటే, ‘జాతిపిత’ను అవమానించడమేనని వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ బిల్లు చట్టంగా మారితే, రాష్ట్రాలపై భారంగా మారుతుందని మండిపడ్డారు.
ప్రియాంక గాంధీకి చౌహాన్ కౌంటర్
జీ రామ్ జీ బిల్లుపై లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చట్టాలకు కేవలం నెహ్రూ పేరు మాత్రమే పెట్టిందని, ఇప్పుడేమో ఆ పార్టీ ఎన్డీయేను ప్రశిస్తోందని ఆయన అన్నారు. మోదీ సర్కార్‌కు పేర్లు మార్చే పిచ్చి ఉందంటూ ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ, పేర్లు మార్చే పిచ్చి విపక్షానికి ఉందని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం పనులపై మాత్రమే దృష్టిసారిస్తుందని వ్యాఖ్యానించారు. ఎంజీఎన్ఆర్‌ఈజీఏ ఒక అవినీతి సాధకమని ఆరోపించారు. సంబంధిత భాగస్వాములతో చర్చించిన తర్వాత మాత్రమే ‘జీ రామ్ జీ’ బిల్లును రూపొందించామని ఆయన వివరించారు.
ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై విపక్ష ఎంపీలు సంతృప్తి చెందలేదు. పలువురు ఎంపీలు స్పీకర్ పోడియంలోకి ప్రవేశించి బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పలువురు ఎంపీలు బిల్లు ప్రతులను కూడా చించివేశారు. విపక్ష సభ్యుల నిరసనపై స్పీకర్ స్పందిస్తూ, ‘‘ప్రజలు మిమ్మల్ని పేపర్లు చించడానికి ఇక్కడికి పంపించలేదు. యావత్ దేశం మిమ్మల్ని చూస్తోంది’’ అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ ఖతం: ప్రియాంక గాంధీ
విపక్షాల మధ్య సభ వాయిదా పడిన సమయంలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లును తీవ్రంగా ఖండిస్తున్నామని, గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏవిధంగా ఖతం అవ్వబోతుందో ఈ బిల్లు చదివితే ఎవరికైనా అర్థమవుతుందని అన్నారు. ఈ బిల్లు రాష్ట్రాలపై నిధుల భారాన్ని పెంచుతుందని, ఇప్పటికే నిధులు లేక రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆమె విమర్శించారు. ఎంజీఎన్ఆర్‌జీఎస్ఏ నిరుపేదలకు మద్దతుగా నిలిచిందని, జీ రామ్ జీ బిల్లు పేదల వ్యతిరేకమని ప్రియాంక గాంధీ అభివర్ణించారు.
Read Also- Hyderabad CP Sajjanar: సాయం చేయని లోకానికి.. భర్త కళ్లు ఇచ్చేసిన మహిళ.. సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్

