Nampally court Bomb Threat: హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. మధ్యాహ్నం 2 గంటలకు బాంబు పేలుతుందంటూ ఉదయం 11 గంటల ప్రాంతంలో మెయిల్ రావడం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. కోర్టులోని న్యాయమూర్తులు, లాయర్లు కాస్త గందరగోళానికి గురయ్యారు. దీంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది హుటీహూటీనా కోర్టు వద్దకు చేరుకున్నారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టిన అనంతరం కీలక ప్రకటన విడుదల చేశారు.
పోలీసులు ఏం చెప్పారంటే?
నాంపల్లి కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు ఫేక్ అని పోలీసులు స్పష్టం చేశారు. బాంబు పెట్టినట్లు వచ్చిన ఈమెయిల్ ఫేక్ అని తేల్చేశారు. అయితే ఉదయం 11 గంటల ప్రాంతంలో బాంబు బెదిరింపు సమాచారం తమ దృష్టికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జడ్జి ఛాంబర్ లో బ్లాస్ జరగబోతున్నట్లు మెయిల్ లో ఉందని పేర్కొన్నారు. దీంతో కోర్టులో కేసుల విచారణను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. దాదాపు మూడున్నర గంటల పాటు కోర్టు ఆవరణలోని ప్రతీ చిన్న ప్రదేశాన్ని కూడా పోలీసులు, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది పరిశీలించింది. చివరికీ ఎలాంటి పేలుడు పదార్థాలు బయటపడకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కోర్టు కార్యాకలాపాలను సైతం తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యాయి.
నిందితుడి కోసం ఆరా
మరోవైపు ఫేక్ ఈమెయిల్ పెట్టిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సైబర్ నిపుణుల సాయం తీసుకుంటున్నారు. బెదిరింపునకు పాల్పడిన వ్యక్తి ఎవరు? ఎక్కడ ఉంటాడు? ఏ ఉద్దేశంతో కోర్టును బెదిరించాడు? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి సైతం ఇటీవల వరుస బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి. ఇలా వరుస బాంబు బెదిరింపు ఘటనలు నగర వాసులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న, మెున్నటి వరకూ విమానాశ్రయాలు, స్కూల్స్ ను బాంబు పేరుతో బెదిరించిన కొందరు కేటుగాళ్లు.. ఇప్పుడు నేరుగా న్యాయస్థానాన్నే టార్గెట్ చేయడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: YS Jagan Mass Warning: అధికారంలోకి రాగానే.. వాళ్లని జైల్లో పెడతాం.. జగన్ మాస్ వార్నింగ్
కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క
నాంపల్లి కోర్టులో యథావిధిగా కేసులు విచారణ ప్రారంభం కావడంతో మంత్రి సీతక్క ఓ కేసు విషయమై విచారణకు హాజరయ్యారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలంటూ గతంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాకు సంబంధించిన కేసులో నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ కేసుపై విచారణ చేస్తోంది.

