Bihar Elections 2025: బిహార్ లో ఎన్డీయే కూటమి మరోమారు అధికారాన్ని చేపట్టే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన 2 గంటల వ్యవధిలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఉదయం 11 గంటల నాటికి ఎన్డీఏ ఏకంగా 191 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మహాకఠ్ బంధన్ కూటమి 49 సీట్లలో లీడింగ్ ఉంది. ఇతరుల్లో నలుగురు ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను చూస్తుంటే బీజేపీ ముఖ్యనేత, హోంమంత్రి అమిత్ షా చెప్పిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి.
గతవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. బీహార్ లో 160 స్థానాలకు పైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 5 పార్టీలు కూటమిగా ఉన్న ఎన్డీయేలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. గెలుపుపై తామంతా పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా వచ్చిన మద్దతు చూస్తే ప్రజలు తమతో ఉన్నారన్న విశ్వాసం కలిగిందని చెప్పారు. కూటమిలోని ఐదు పార్టీలు పంచపాండవులుగా ముందుకు సాగుతున్నట్లు అమిత్ షా గతవారం వ్యాఖ్యానించడం గమనార్హం.
మరోవైపు బిహార్ పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ సైతం ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని స్పష్టం చేశాయి. దాదాపు 13 ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమిదే విజయమని వెల్లడించాయి. ఇందుకు తగ్గట్లే బిహార్ లో కౌంటింగ్ మెుదలైనప్పటి నుంచి ఎన్డీయే కూటమి స్ఫష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. మహాకఠ్ బంధన్ కూటమి ఏ దశలోనూ పోటీ ఇచ్చినట్లుగా కనిపించలేదు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఎన్డీఏలోని జేడీయూ కూటమి ఈసారి అధిక సీట్లు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జేడీయూ 79 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 74 సీట్లలో లీడ్ లో ఉంది.
Also Read: Kaantha Review: కాంతా మూవీ రివ్యూ.. భయాన్ని జయించి నిజం కోసం నిలిచిన కథ
మహాకఠ్ బంధన్ కూటమి విషయానికి వస్తే.. పొత్తులో భాగంగా తీసుకున్న 61 స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆర్జేడీ 143 స్థానాలకు గానూ 47 స్థానాల్లో ముందంజలో ఉంది. 2020 ఎన్నికల్లో కాంగ్రెస్ 70 సీట్లలో పోటీ చేయగా.. కేవలం 19 సీట్లు మాత్రమే గెలిచింది. ఆర్జేడీ 75 సీట్లు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ప్రస్తుత కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే 2020లో కంటే ఈ సారి మహాకఠ్ బంధన్ సీట్లు గణనీయంగా తగ్గే పరిస్థితులు ఉన్నాయి.
