RBI on Rs 2,000 Note: కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. 2023లో రద్దు చేసిన రూ.2000 నోట్లు.. ఇప్పటికీ దేశంలో చెలామనీ అవుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రూ.2000 నోట్లకు సంబంధించిన షాకింగ్ నివేదికను ఆర్‌బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో రూ.5,669 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్దనే ఉన్నాయి. అయితే వాటిని తిరిగి బ్యాంకులో జమ చేసుకునే వెసులుబాటును సైతం కల్పిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
2% ఇంకా ప్రజల వద్దే..
ప్రస్తుతం దేశంలో రూ.2000 నోట్ల స్థితి గతులకు సంబంధించి గురువారం ఒక బులెటిన్ ను ఆర్‌బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం 2023 మే 19న నోట్ల ఉపసంహరణ చేసే సమయానికి రూ.3.56 లక్ష కోట్ల విలువైన రూ.2000 నోట్లు చెలామనీలో ఉన్నాయి. 2025 డిసెంబర్ 31 నాటికి అది రూ.5,669 కోట్లకు తగ్గిపోయింది. నోట్ల ఉపసంహరణ ప్రకటించిన తర్వాత దాదాపు 98 శాతం నోట్లు తిరిగి వచ్చాయని ఆర్‌బీఐ తెలిపింది. కానీ ఇప్పటికీ 2 శాతం నోట్లు ప్రజల వద్దనే ఉన్నట్లు ఆర్‌బీఐ తాజా నివేదిక పేర్కొంది.
రూ.2000 నోట్లు మార్చుకోవచ్చు
అయితే రద్దు చేసిన రూ.2000 నోట్లను వినియోగించడం చట్టవిరుద్దమా? కాదా? దానిపై ఆర్‌బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రూ.2000 నోటును కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని మాత్రం ఆర్బీఐ పేర్కొంది. ఆ నోటును తిరిగి బ్యాంక్ లో జమ చేయాలని మాత్రం తాజాగా సూచించింది. కాగా రూ.2000 నోటును బ్యాంకులో జమ చేసే అవకాశం 2023తోనే ముగిసింది. అయితే ఇప్పటికీ ఆ నోటును కలిగి ఉన్నవారు.. ఆర్‌బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఏ విధంగా మార్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
Also Read: Telangana DGP: తెలంగాణలో సంచలనం.. డీజీపీ ఎదుట లొంగిపోయిన.. టాప్ మావోయిస్టు నేత
ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
సాధారణ బ్యాంకుల్లో రూ.2000 నోటును మార్చుకునే వెసులుబాటును 2023లోనే ఆర్‌బీఐ క్లోజ్ చేసింది. కాబట్టి దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో గల ఆర్‌బీఐ కార్యాలయ వద్దకు వెళ్లి వీటిని మార్చుకునే వెసులుబాటు ఇప్పటికీ ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న 19 కార్యాలయాల్లో ఎక్కడికైనా వెళ్లి రూ.2000 నోట్లు ఛేంజ్ చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. ప్రత్యక్షంగా వెళ్లలేని సందర్భాల్లో పోస్టాఫీసు ద్వారా ఆర్‌బీఐ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపించవచ్చని తెలిపింది. ఆ నగదు తిరిగి మీ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, దిల్లీ, కోల్ కత్తా సహా 19 నగరాల్లో ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

