Gold Silver Prices: ప్రపంచంలో ఏదైనా కీలక ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు, రాజకీయ ఉద్రిక్తతలు నెలకొంటే, ఆ ప్రభావం అంతర్జాతీయంగా ఉంటుంది. సాధారణంగా స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడం, కీలకమైన క్రూడ్ ఆయిల్, బంగారం, వెండి కమొడిటీస్ ధరల్లో అనూహ్యమైన మార్పులు సంభవిస్తుంటాయి. మరి, వెనిజులాపై అమెరికా సైనిక చర్యకు దిగడం, ఏకంగా ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మధురో, ఆయన భార్యను బంధించి తీసుకెళ్లిన పరిణామాలు అంతర్జాతీయంగా ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతాయి?, బంగారం, వెండితో పాటు క్రూడ్ ఆయిల్ ధరలు ఉన్నపళంగా పెరుగుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పెద్దగా ప్రభావం ఉండదు!
వెనిజులా ఆర్థిక వ్యవస్థ పరిమాణం చిన్నది కావడంతో అమెరికా దాడి ప్రభావం ప్రపంచ దేశాలపై పెద్దగా ఉండదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. భారతీయ స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం ఉండకపోవచ్చునని విశ్లేషించారు. మార్కెట్లు లాభాలతోనే ప్రారంభమవుతాయని అంటున్నారు. ఇక, బంగారం, వెండి, కాపర్, క్రూడ్ ఆయిల్, గ్యాస్ వంటి కమొడిటీస్ ధరలపై కూడా ప్రభావం ఉండబోదని అంచనా వేశారు.
ఈ తాజా పరిణామంపై బసవ్ క్యాపిటల్ సహవ్యవస్థాపకుడు సందీప్ పాండే స్పందిస్తూ, అమెరికా-వెనిజులా సంక్షోభం సముద్ర మార్గాన్ని సంక్షోభంలోకి నెట్టినట్టు అయ్యిందని అన్నారు. వెండి విషయంలో అతిపెద్ద ఎగుమతిదారులుగా ఉన్న పెరూ, చాద్ దేశాలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారవచ్చని, దీని ఫలితంగా వెండి ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషించారు. బంగారం ధర పెరిగే అవకాశం కూడా లేకపోలేదని అంచనా వేశారు. అయితే, భారతీయ స్టాక్ మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉంటాయని భావిస్తున్న సందీప్ పాండే చెప్పారు. అయితే, క్రూడ్ ఆయిల్ పెరిగిన నేపథ్యంలో, ఇంధన రంగ స్టాక్ ధరలు కొంతమేర ప్రతికూలంగా ప్రభావితం అయ్యే సూచనలు ఉన్నాయని చెప్పారు.
నిశితంగా పరిశీలిస్తున్నాం: ఇటలీ ప్రధాని మెలొనీ
వెనిజులాలో అమెరికా జరిపిన దాడులపై ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలొనీ స్పందించారు. అగ్రరాజ్యం దాడి అనంతరం, వెనిజులాలో పరిస్థితిని తాను నిశితంగా పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అక్కడి పౌరుల పరిస్థితిపై సమాచారాన్ని సేకరిస్తున్నట్టు చెప్పారు. ఇటలీ ప్రధాని ఆంటోనియో తజానీతో కాంటాక్టులో ఉన్నానని వివరించారు. కాగా, ఇటలీకి చెందిన లక్షా అరవై వేల మంది పౌరులు వెనిజులాలో ఉంటున్నారు. వారికి ద్వంద్వ పౌరసత్వాలు ఉన్నాయి. అందుకే, వారి క్షేమంపై ఇటలీ ప్రధాని ఆందోళన చెందుతున్నారు.

