Gopichand P Hinduja: ప్రపంచ ప్రసిద్ధ వ్యాపార వేత్త, హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) కన్నుమూశారు. లండన్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. హిందూజా నలుగురు సోదరుల్లో గోపిచంద్ రెండవవారు. ఆయన అన్న శ్రీచంద్ హిందూజా (Sri Chand Hinduja).. 2023లో మరణించడంతో హిందూజా గ్రూప్ సంస్థలకు చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 3వ, 4వ సోదరులైన ప్రకాష్ హిందూజా (Prakash Hinduja), అశోక్ హిందూజా (Ashok Hinduja) కూడా కుటుంబ వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉన్నారు. అటు వ్యాపార వర్గాల్లో ‘జీపీ’ (GP)గా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన గోపిచంద్.. కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు వ్యాపార వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
స్వాతంత్రానికి ముందు నుంచే వ్యాపార రంగంలో ఉన్న హిందూజా గ్రూప్ లోకి 1959లో గోపిచంద్ పి. హిందూజా అడుగుపెట్టారు. భారత్, మధ్యప్రాచ్యంలో మాత్రమే వ్యాపార కార్యక్రమాలు సాగిస్తున్న హిందూజా సంస్థను.. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన తన వంతు పాత్ర పోషించారు. బ్యాకింగ్, ఫైనాన్స్, ఆటోమోటివ్, మీడియా, ఎనర్జీ తదితర వ్యాపార రంగాల్లోకి హిందూజా విస్తరించడంలో ముఖ్య భూమిక పోషించారు. హిందూజా కంపెనీ వెబ్ సైట్ ప్రకారం.. ప్రస్తుతం ఆ సంస్థ 11 రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. అశోక్ లేలాండ్ (Ashok Leyland), ఇండస్ ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), నెక్ట్స్ డిజిటల్ లిమిటెడ్ (NXTDIGITAL Limited) హిందూజా గ్రూప్ నకు చెందిన ప్రముఖ బ్రాండ్లుగా ఉన్నాయి.
Also Read: DGP Sivadhar Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ.. కీలక విషయాలు వెల్లడి
సండే టైమ్స్ రిచ్ లిస్ట్ – 2025 ప్రకారం.. గోపీచంద్ పి. హిందూజా కుటుంబం యూకేలో అత్యంత సంపన్న ఫ్యామిలీగా నిలిచింది. వారి ఆస్తి విలువ 32.3 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.3.4 లక్షల కోట్లు)గా ఉంది. అయితే హిందూజా కుటుంబం 2021లో ఒక కుటుంబ వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. శ్రీచంద్ హిందూజా కుమార్తెలైన వినూ, షానూ.. తమ బాబాయిలైన గోపీచంద్, ప్రకాశ్, అశోక్ లకు వ్యతిరేకంగా లండన్ కోర్టును ఆశ్రయించారు. కంపెనీ నిర్ణయాధికారాల్లో తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఎవరికీ ప్రత్యేకమైన హక్కులు లేవంటూ 2013లో సోదరుల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాన్ని కోర్టుకు చూపించడంతో వివాదం సద్దుమణిగింది.
