YS Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేపట్టిన కృష్టా జిల్లా పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్ లోని పలువురికి స్వల్పగాయాలైనట్లు తెలుస్తోంది. అయితే జగన్ కు మాత్రం ఎలాంటి గాయాలు కాకపోవడంతో వైసీపీ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద అనంతరం కాన్వాయ్ కొద్దిసేపు రోడ్డుపైనే నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బందరు రోడ్డులో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ఇటీవల వచ్చిన మెుంథా తుపాను (Cyclone Montha) ప్రభావంతో కృష్ణా జిల్లాల్లో పెద్దఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైతులను పరామర్శించేందుకు వైఎస్ జగన్.. కృష్ణా జిల్లాకు వచ్చారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నట్లు వైసీపీ వర్గాలు ప్రకటన విడుదల చేశాయి. పర్యటనలో భాగంగా పెనమలూరు సెంటర్ కు చేరుకున్న జగన్ కు వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రోడ్డుపై బైక్ ర్యాలీ నిర్వహించి.. తమదైన శైలిలో ఆహ్వానం పలికారు.
కృష్ణాజిల్లా గండిగుంట వద్ద జగన్ కాన్వాయిలో ఒకదానికొకటి గుద్దుకున్న కార్లు. భారీగా ట్రాఫిక్ జామ్. నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?#IconNewsBreakings #YSJagan #AndhraPradesh pic.twitter.com/3JJ1tUsRin
— Icon News (@IconNews247) November 4, 2025
పోలీసులతో వాగ్వాదం..
పెనమలూరు నియోజకవర్గానికి వచ్చిన జగన్ కు స్వాగతం పలికేందుకు వైసీపీ శ్రేణులు డీజేను ఏర్పాటు చేశారు. అయితే దానికి అనుమతి లేదని చెబుతూ పోలీసులు బలవంతంగా తీయించేశారు. దీంతో పోలీసులు.. వైసీపీ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మీ తీరుతో బందరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోందని వైకాపా శ్రేణులపై పోలీసులు అసహనం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే పెనమలూరు నుంచి జగన్ కాన్వాయ్ పామర్రు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దారిపొడవునా వైసీపీ శ్రేణులు జగన్ కు స్వాగతం పలుకుతున్నారు.
Also Read: Bigg Boss Telugu: మిస్టరీ ఫోన్ కాల్.. కన్ఫ్యూజన్‌లో హౌస్‌మేట్స్.. బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేశారుగా!
ఆంక్షలతో జగన్‌ను ఆపలేరు: నాని
కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన పర్యటనపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు పెడుతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. తుపాను కారణంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఆంక్షలు, నిర్భందాలతో జగన్ ను ఆపలేరని.. చంద్రబాబు తరహాలో డబ్బులిచ్చి జనాన్ని పోగేసుకోవాల్సిన అవసరం వైసీపీ అధినేతకు లేదని పేర్ని నాని అన్నారు. రైతుల కష్టాన్ని ఆలకించేందుకు ఒక్క మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ పొలంలోకి అడుగుపెట్టలేదని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.

