Pakistan Bombing: పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ అనూహ్య చర్యకు పాల్పడింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని ఒక గ్రామంపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో బాంబుల వర్షం (Pakistan Bombing) కురిపించింది. ఏకంగా 8 బాంబులతో విరుచుకుపడింది. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ఈ దాడులకు పాల్పడినట్టుగా అధికారికంగా నిర్ధారణ కాలేదు. కానీ, ఈ బాంబుల దాడిలో కనీసం 30 మంది పాక్ పౌరులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అందులో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చాలామంది గాయపడినట్టుగా వార్తలు వస్తున్నాయి. రాత్రి 2 గంటల సమయంలో జేఎఫ్-17 యుద్ధ విమానాల నుంచి ఎల్‌ఎస్-6 బాంబులను మాత్రే దారా గ్రామంపై జారవిడిచినట్టుగా స్థానిక మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ గ్రామంలో పశ్తూన్ అనే సంచార తెగవారు పెద్ద సంఖ్యలో నివసిస్తుంటారు. బాంబు పేలుళ్ల ప్రభావంతో గ్రామంలోని అధిక భాగం ధ్వంసం అయ్యింది. అయితే, ఈ ఘటనపై అధికారిక వర్గాలు ఇంకా ధృవీకరణ ప్రకటన చేయలేదు.
Read Also- Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!
ఉగ్రవాదులే లక్ష్యమా?
గ్రామంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు, వారి స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ ఈ దాడులు చేసినట్టు పాకిస్థాన్ స్థానిక మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ దాడిలో చనిపోయినవారంతా సామాన్య ప్రజలేనని పేర్కొన్నాయి.
ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా రాష్ట్రం అఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉంటుంది. కొండ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులే లక్ష్యంగా పాక్ మిలిటరీ బలగాలు ఇటీవలి కాలంలో పలుమార్లు దాడులు చేశాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులపై పాక్ ఆర్మీ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెల్లవారుజామున గ్రామంపై దాడి జరిగింది. కాగా, ఆదివారం కూడా డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా జరిగిన ఆపరేషన్‌లో ఏడుగురు తహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదులు హతమయ్యారని పాకిస్థాన్ సైన్యం ప్రకటించింది. ఈ ఏడుగురిలో ముగ్గురు అఫ్ఘనిస్థాన్ పౌరులు ఉన్నారని వివరించారు. అందులో ఆత్మాహుతి దాడులకు పాల్పడే ఉగ్రవాదులు ఇద్దరు ఉన్నారని పాక్ సైన్యం మీడియా విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఒక ప్రకటన విడుదల చేసింది.
అంతకముందు, సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కూడా ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో కనీసం 31 మంది టీటీపీ ఉగ్రవాదులు హతమయ్యారు. ఇటీవలి కాలంలో, ముఖ్యంగా అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో పాకిస్థాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు మళ్లీ పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవల అఫ్ఘనిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చారు. అఫ్గానిస్తాన్.. ఉగ్రవాదులతో చేతులు కలపాలా?, లేక పాకిస్థాన్‌తో కలిసి ఉండాలా? అనేది ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.