Soil Mafia:: మధిర నియోజకవర్గం లోని ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో విచ్చలవిడిగా, ఎక్కడపడితే అక్కడ మట్టి మాఫియా రవాణా కొనసాగుతోందని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు ఆరోపించారు. అక్రమంగా తవ్వుతున్న క్వారీలను సిపిఎం బృందం సందర్శించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ఎర్రుపాలెం మండలంలో కొంతమంది మట్టి మాఫియా సిండికేట్ గా ఏర్పడి ఎక్కడ గుట్ట కనపడితే అక్కడ గుట్టలు తవ్వి అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని చెప్పారు. ఇంత జరుగుతుంటే ఎర్రుపాలెం మండల తహసిల్దార్, మైనింగ్ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు.
Also Read: Urea Distribution: రైతన్నలకు గుడ్ న్యూస్.. రెవెన్యూ గ్రామాల వారీగా యూరియా పంపిణి
మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది
అక్రమంగా రవాణా జరుగుతుంటే ఆ వైపు తహసిల్దార్ కన్నెత్తి కూడా చూడకపోవటంతో మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుందన్నారు. అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయకుండా వారికి పరోక్షంగా మండల అధికారులు సహకరిస్తున్నారని తెలిపారు. అక్రమార్కులు సంపాదించిన డబ్బులు కొంత అధికారులకు కూడా అందడంతో అటువైపు చూడడం లేదని ప్రజల నుంచి విమర్శలు ఉన్నాయని తెలిపారు. మండలంలో అక్రమ వ్యాపారులకు సహకరిస్తూ అవినీతిని పెంపొందించే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు బాపోతున్నారని తెలిపారు. మండల అధికారుల వైఫల్యం వల్లే మట్టి మాఫియా దందా జరుగుతుందని వెల్లడించారు.
అధికారులకు మట్టి మాఫియా దందా కనిపించడం లేదా?
రోడ్లమీద ప్రయాణం చేసే సామాన్య ప్రజలను ఆపి బైకులను తనిఖీలు చేసి సరైన ధ్రువపత్రాలు ఉన్నాయా లేదా అనే విధంగా వేధించి చాలాన్లు విధించే అధికారులకు మట్టి మాఫియా దందా కనిపించడం లేదా అంటూ విమర్శించారు. అక్రమ మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసే నాధుడే కరువైపోవడంతో దాన్ని నిర్మూలించేందుకు సిపిఎం పార్టీ నడుం బిగించిందన్నారు. ఈనెల 22వ తారీకు సోమవారం జమలాపురం నుండి ఎర్రుపాలెం తహసిల్దార్ కార్యాలయం వరకు నిర్వహించే ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తహసిల్దార్ కార్యాలయం వద్ద వంటావార్పు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ ప్రజా చైతన్య యాత్రలో ప్రజలు భాగస్వాములై ప్రకృతి సంపదను కాపాడుకునేందుకు ప్రజలు సహకరించి పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంగోతు వెంకటేశ్వర్లు, బేతి శ్రీనివాసరావు, దివ్వెల ఆంజనేయులు, ఆంగోతు రంగ పాల్గొన్నారు.