Hyderabad Police Bust: ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న గ్యాంగును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ (Hyderabad Police )చేశారు. నిందితుల నుంచి 25వేల నగదు, 55 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్ టాప్ లు, ఓ ట్యాబ్, 60 డెబిట్ కార్డులు, 3 స్కానర్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ మహ్మద్ ఇక్భాల్ సిద్దిఖీ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చార్మినార్ ప్రాంతంలోని ఘాన్సీబజార్ నివాసి గిరీష్ అగర్వాల్ (39) వస్త్ర వ్యాపారి. కాగా, కొన్ని రోజుల క్రితం అతనికి కొన్ని ఆన్ లైన్ లో బెట్టింగ్ ప్లాట్ ఫాంల గురించి తెలిసింది.
వీటి ద్వారా తేలికగా డబ్బు సంపాదించ వచ్చనుకున్న గిరీష్ అగర్వాల్ ఆయా బెట్టింగ్ ప్లాట్ ఫాంలలో తన పేరును రిజిష్టర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో బెట్టింగ్ ప్లాట్ ఫాంలు అతనికి యూజర్ నేమ్, పాస్ వర్డులు పంపించాయి. ఆ తరువాత గిరీష్ అగర్వాల్ తనకు పరిచయం ఉన్న పెట్లబుర్జు చార్ మహల్ నివాసి మనీందర్ పాల్ సింగ్ (36), రాజస్తాన్ కు చెందిన పవన్ కుమార్ శర్మ, కిషన్ శర్మ (24), శాలిబండకు చెందిన మోహిత్ అగర్వాల్ (27), హయత్ నగర్ నివాసి రాహుల్ అగర్వాల్ (32)తో కలిసి గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు.
Also Read: CM Revanth Reddy: ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
పంటర్ అరెస్ట్ తో…
కాగా, పురానాపూల్ కు చెందిన సురేష్ సోనీ కొన్ని రోజులుగా గిరీష్ అగర్వాల్ నుంచి బెట్టింగ్ పాయింట్లు కొంటూ ఆన్ లైన్ బెట్టింగులు ఆడుతున్నట్టుగా తెలిసి టాస్క్ ఫోర్స్ సీఐ యధేందర్, ఎస్ఐ రవిరాజ్ తోపాటు సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్ట్ చేశారు. విచారణలో అతను వెల్లడించిన వివరాల మేరకు గిరీష్ అగర్వాల్ తోపాటు మిగితా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గిరీష్ అగర్వాల్ తన గ్యాంగ్ లో ఉన్న వారితో బ్యాంక్ అకౌంట్లు తెరిపించి వాటి ద్వారా నగదు లావాదేవీలు నడిపినట్టుగా వెల్లడైంది.
ఒక్కో ఖాతా తెరిచినందుకు సభ్యులకు 3వేల రూపాయల చొప్పున ఇచ్చినట్టుగా తెలిసింది. 9.80లక్షల రూపాయలు చెల్లించి SKYEXCH ప్లాట్ ఫాం నుంచి పాయింట్లు కొన్నట్టుగా వెల్లడైంది. అదేవిధంగా RADHE EXCHANGE నుంచి 94 వేల పాయింట్లు, 99 RACES నుంచి 3.91లక్షల పాయింట్లు, 365 RACES నుంచి 7.85లక్షల పాయింట్లు, Placebet999 నుంచి 23.51లక్షల పాయింట్లు కొన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. ఒక్కో పాయింట్ ఒక్కో రూపాయికి సమానమని చెప్పిన అదనపు డీసీపీ మహ్మద్ ఇక్భాల్ నిందితుడైన గిరీష్ అగర్వాల్ మొత్తం 23.51లక్షల పాయింట్లను ఆయా ఆన్ లైన్ బెట్టింగ్ ప్లాట్ ఫాంల నుంచి కొన్నట్టుగా తెలిపారు.