CM Revanth Reddy: దిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఓ చిట్ చాట్ లో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా ఉన్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లు కాదని సీఎం అన్నారు. తాను ఇవాళ ప్రోగామ్ లో ఎంతోమందికి కండువాలు కప్పానని.. ఆ కండువా ఏంటో చూసుకోకుండానే వారు కప్పించుకున్నారని వ్యాఖ్యానించారు.
‘పార్టీ ఫండ్.. బీఆర్ఎస్‌కే వెళ్తోంది’
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తమకు 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని అసెంబ్లీలో ప్రకటించారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. సమయం కూడా కేటాయించాలని స్పీకర్ కోరారని చెప్పారు. అయితే పార్టీ పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని సీఎం స్పష్టం చేశారు. ‘బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల జీతాల నుంచి నెలకు రూ.5000 చొప్పున పార్టీ ఫండ్ వెళ్తా ఉంది. ఇవన్నీ టెక్నికల్ గా చూసుకుంటే వాళ్లు ఏ పార్టీలో ఉన్నారో వారికే తెలియాలి’ అని సీఎం అన్నారు.
‘కవిత స్వయంగా చెప్పారు’
బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావు ప్రయత్నించారని.. సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత స్పష్టం చేశారని గుర్తుచేశారు. ‘2014 -19 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి లేరు. కానీ మహిళా రిజర్వేషన్ల కోసం ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది. చట్టసభలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించాలని ప్రయత్నిస్తోంది’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
‘మావోయిస్టులపై దయ చూపాలి’
మరోవైపు యూరియా విషయంలో విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి అన్నారు. ‘రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ప్రస్తుతం 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఉంది. కేంద్ర ప్రభుత్వం కొరతను సృష్టించింది. రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. నక్సలైట్లు లొంగిపోవడానికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పాలసీలు తీసుకొచ్చాయి. వారికి జనజీవన స్రవంతిలో కలిసేందుకు అవకాశం ఉంది. టెర్రరిస్టులతో చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు నక్సలైట్లతో చర్చించేందుకు వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్లు కూడా మన అన్నదమ్ములే కదా. నక్సలైట్ల విషయంలో కేంద్రం దయ చూపించాలి’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Tirupati: తిరుపతిలో రెచ్చిపోయిన పోకిరీలు.. నడిరోడ్డుపై కోటింగ్ ఇచ్చిన పోలీసులు
కేసీఆర్ ను ట్రంప్ తో పోలుస్తూ..
అంతకుముందు మరో వేదికపై మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ట్రంప్ తో పోలుస్తూ పరోక్ష విమర్శలు చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతో అమెరికాకే ఎక్కువగా నష్టం. ట్రంప్ ఒకరోజు మోదీ నా ఫ్రెండ్ అంటాడు.. మరో రోజు అడ్డగోలుగా సుంకాలు వేస్తారు. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడు. ఆయనను తెలంగాణ ప్రజలు పక్కనపెట్టారు. రాత్రి వచ్చిన ఆలోచనను తెల్లారే అమలు చేయడం సాధ్యం కాదు’ అని రేవంత్ అన్నారు.