Gadwal District: గద్వాలలో ఇటీవల కొందరు ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలలో చెలరేగిపోతున్నారు. గద్వాల (Gadwal) చరిత్రలో అనేక రంగాలలో పూర్వీకుల నుంచి ఆనవాయితీగా కొనసాగుతున్న సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రస్తుత సమాజంలో అనేక ఒడిదుడుకులను అధిగమిస్తూ జీవనం సాగిస్తున్న సాంప్రదాయ కుటుంబాలు పలువురికి ఆదర్శంగా నిలస్తుండగా, నూతన పోకడలకు అలవాటు పడ్డ నేటి యువతరం తప్పుదారిలో పయనిస్తోంది. ఎంతో ఘన కీర్తి కలిగిన గద్వాల చరిత్రలో యువకుల చేష్టలతో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గద్వాలలోని కొన్ని వార్డులకు చెందిన యువత మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్నారు.
అడ్డు అదుపు చెప్పే నాథుడు లేడు
ఎంతలా అంటే మాకెవరు అడ్డు అదుపు చెప్పే నాథుడు లేదనే లెవెల్ లో కొందరు యువకులు విలనిజం ప్రదర్శిస్తూ ఇతర వర్గం వారితో వైరం పెట్టుకుని ఏకంగా భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఇద్దరు కౌన్సిలర్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు హోలీ అనంతరం కృష్ణానదిలో స్నానాలు ఆచరిస్తుండగా మాట మాట పెరిగి ఇరువర్గాలు రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఆ సంఘటనపై గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని ఓ మాజీ కౌన్సిలర్ ప్రయత్నించగా పోటీగా మరో కౌన్సిలర్ పోలీస్ స్టేషన్ కు రావడంతో వారి అనుచరులు సైతం గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ సైతం తాగిన మైకంలో దాడులు చేసుకున్నారు.
Also Read: Gadwal Collectorate: గద్వాల ప్రజాపాలన వేదికపై ఉద్రిక్తత.. గ్రంథాలయ చైర్మన్ ఆవేశం
రాజకీయ నాయకులు జోక్యం కారణం
ఈ సంఘటనలో ఎస్సైను సైతం నెట్టి వేయగా ఒక్కసారిగా నివ్వెరపోయిన పోలీస్ బృందం తీవ్ర స్థాయిలో ప్రతిఘటించాల్సి వచ్చింది.నాటి నుంచి నేటి వరకు ఈ మూడు నెలల్లో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తరచుగా ఒక వర్గం వారే గొడవలకు కారణం అవుతున్నా, వారిపై తీవ్రమైన శిక్షలు విధించేందుకు పోలీసులు వెనుకాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం స్థానిక రాజకీయ నాయకులు జోక్యం కారణంగానే. తమ అనుచరులపై పోలీస్ కేసు నమోదు అయిందంటే చాలు వారి నాయకులు ఓ ప్రజా ప్రతినిధి వద్దకు చేరి ఫోన్ కొట్టించేసరికి పోలీసులు సైతం ఒకే సార్ అనే పరిస్థితి దాపురిస్తోంది.
దీంతో ఒకప్పుడు ఎంతో క్రమశిక్షణతో మెలుగుతూ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న యువత నేడు తరచుగా వరుస ఘర్షణలకు పాల్పడుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గద్వాల నుంచి నది అగ్రహారం రోడ్డులో ఓ వస్త్ర వ్యాపారిపై ఆకతాయిలు దాడికి పాల్పడ్డారు అదేవిధంగా జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు వెళ్తుండగా వెనకాల ద్విచక్ర వాహనంపై వస్తున్న యువకులు బస్సు సైడ్ ఇవ్వడం లేదని వెంబడించి సైడ్ కు ఆపించి డిఎస్పి ఆఫీసుకు సమీపంలోనే డ్రైవర్ పై తాగిన మైకంలో దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు గాయపడగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్న వెలుగులోకి రాని సంఘటనలు మరెన్నో ఉన్నాయి.
యథేచ్చగా బెల్ట్ షాపుల నిర్వహణ
గద్వాల (Gadwal)లో మందు బాబుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు యతేచగా రాత్రి పగలు అనే తేడా లేకుండా బెల్టు షాపులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల చింతలపేట కాలనీకి చెందిన చింతలపేట చీత యూత్ పేరిట యువకులు వినాయక నిమజ్జనం సందర్భంగా రాత్రి వేళలో రామ్ నగర్ లో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తూ ప్రతినిత్యం ఆకతాయిలకు మద్యం సరఫరా చేస్తుండడంతో యూత్ పెడదారిన పడుతున్నారు. దీంతో సమీపంలోని కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
సమీపంలోనే ఎక్సైజ్ శాఖ కార్యాలయం ఉన్నా తమకేమీ పట్టనట్లు మామూలు మత్తులో ఉండడంతో వారి వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉండడంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆజ్యం పోస్తున్నారు.అదే యూత్ ఆకతాయిలు అంబేద్కర్ నగర్ కు చెందిన యువతతో మాట పెరిగి దాడులకు తెగబడే పరిస్థితి దాపురించింది. దీంతో ఇద్దరి తలలకు తీవ్ర గాయాలు కాగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో 11 మంది పై కేసులు నమోదు అయ్యాయి. అదే రోజే దౌదర్ పల్లి వార్డు లో సైతం ఓ డీలర్ పై దాడికి పాల్పడ్డారు. మరో ఘటనలో తమ నాయకుడి ఫ్లెక్సీని చించారని అందుకు కారకులైన వారితో గొడవకు తెగబడ్డారు. ఇలా నిత్యం నిశ్శబ్దంగా ఉండే పట్టణంలో తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
జిల్లా కేంద్రంలోనే పోలీస్ బాస్ ఉన్నా
స్థానికంగానే జిల్లా ఎస్పీ,డీఎస్పి , వివిధ విభాగాల పోలీస్ యంత్రాంగం జిల్లా కేంద్రంలోనే ఉన్న ఆకతాయిల ఆగడాలను ఆదిలోనే అరికట్ట లేకపోవడంతో రోజు రోజుకి వారి ఆగడాలు శృతి మించుతున్నాయి. సమాజంలో పాశ్చాత్య ధోరణి అవలంబిస్తూ కొందరు పోకిరీలు విచ్చలవిడిగా విలువలను మరిచి సమాజంలో ఎన్నో భిన్న సంస్కృతుల ప్రజల మధ్య యతెచ్చగా వ్యవహరిస్తూ తోటి వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు.. రోడ్లపై త్రిబుల్ రైడింగ్ చేయడంతో పాటు రోడ్డు నిబంధనలు పాటించకుండా స్పీడ్ లిమిట్ తో సంబంధం లేకుండా వాహనాలు డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీంతో పెద్దలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు తరచుగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: YS Sharmila: బెన్‌ఫిట్ టికెట్లపై ఉన్న శ్రద్ధ.. రైతుల గిట్టుబాటు ధరపై లేదు.. పవన్‌పై షర్మిల ఫైర్!