Adwait Kumar Singh: వివిధ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ (Adwait Kumar Singh) ఆదేశించారు. సీరోలు మండలంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల, జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందుగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలోని బాలుర, బాలికల వసతి గృహాలను, విద్యార్థులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కిచెన్, నిలువ చేసిన ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు, బియ్యం, త్రాగునీరు వంటి వాటిని నిశితంగా పరిశీలించారు.
Also Read: Suryapet SP Narasimha: బ్యాంకులు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాలి.. జిల్లా ఎస్పీ కీలక సూచనలు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి
పాఠశాలల, వసతి గృహాల్లో పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సూచించారు. వంట మనుషులు అనుభవం ఉన్న వారితో వంటలు చేయించాలన్నారు. భోజన మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని చెప్పారు. విద్యార్థులకు శుచి, శుభ్రతలతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలన్నారు. కంప్యూటర్ ల్యాబ్ తనిఖీ చేసి విద్యార్థుల్లో పాఠశాల స్థాయిలోనే కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందుకోసం ఉపాధ్యాయులు విద్యార్థులకు కంప్యూటర్ విద్యపై పట్టు సాధించేలా కంప్యూటర్ విద్యను బోధించాలన్నారు.
విద్యార్థులతో ఇంటరాక్షన్
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ లోని బాలుర, బాలికలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల విద్యార్థులతో కలెక్టర్ ఇంటరాక్షన్ చేపట్టారు. విద్యార్థుల జీవిత ఆశయ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠ్యాంశాలలోని వివిధ అంశాలపై కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానం చెప్పడంతో విద్యార్థులను అభినందించారు. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన విద్యా ప్రమాణాలు అందించేందుకు తీసుకోవలసిన చర్యలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదపడతాయి
విద్యార్థులకు చదువుతోపాటు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని అందుకోసం పాఠశాల ప్రాంగణంలో అనువైన ఆట స్థలాలను గుర్తించి చదును చేసి వాడుకలోకి తీసుకురావాలన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యం పెట్టుకుని, లక్ష్యసాధనకు శ్రమించాలన్నారు. విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని, విద్యతోనే జీవితంలో ఉన్నత స్థానంలో స్థిరపడేందుకు అవకాశం లభిస్తుందని సూచించారు. ఈ తనిఖీల్లో కలెక్టర్ వెంట శిరోల్ ప్రత్యేక అధికారి, తహసిల్దార్ పున్నం చందర్, ఈ ఎం ఆర్ ఎస్ ప్రిన్సిపాల్ సంతోష్ సోనీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బంగారి, ఆర్ ఐ లో సుమతి, శ్రావణి, గ్రామ పరిపాలన అధికారి వీరస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.